జైపూర్, నవంబర్ 6: చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. బుధవారం జైపూర్ మండలం ఇందారంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ ముందే కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగి కొట్టుకున్నంత పనిచేశారు. ఎమ్మెల్యే కార్యక్రమానికి కార్యకర్తలు ఎవరూ రాలేదనే చర్చ జరుగుతుండగా.. ఇందారం మాజీ సర్పంచ్ జక్కుల వెంకటేశం కల్పించుకుని ‘కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫయాజ్ఖాన్ నాయకులు, కార్యకర్తలెవరికీ సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యేను కార్యక్రమానికి ఆహ్వానించారు’ అని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఫయాజ్ స్పందిస్తూ.. ‘నాపై ఉన్న వ్యక్తిగత కక్షతో.. కార్యక్రమాన్ని ఫెయిల్ చేద్దామని గొడవ సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే కార్యక్రమం ఉంటుందని నేను ప్రతి ఒక్కరికీ వాట్సాప్లో, పర్సనల్గా మెసేజ్ చేశాను’ అని తెలిపారు. ఈ విషయంలో ఇద్దరు నేతలు పరస్పరం తిట్టుకున్నారు. ‘ఇసుక దొంగతనాలు నువ్వు చేస్తున్నావంటే నువ్వు చేస్తున్నావు’ అని ఆరోపించుకున్నారు. ఒకానొక దశలో ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లారు. దీంతో ఎ మ్మెల్యే వివేక్ తీవ్రమైన అసహనానికి గురయ్యారు. ఎస్సీ కాలనీలో మరో కార్యక్రమం లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ గొడవ జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ కూడా అక్కడే ఉన్నారు.