ఆదిలాబాద్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్‌లో సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆదిలాబాద్‌లో గురువారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు.
సభలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రసంగిస్తుండగా.. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా లేచి స్థానిక కాంగ్రెస్ నేతకు మద్దతుగా ఫ్లెక్సీలు ప్రదర్శించారు. పోలీసులు ఫ్లెక్సీలను లాక్కొని కార్యకర్తలను కూర్చోబెట్టారు. దీంతో నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేశ్‌జాదవ్‌ను ఇటీవల ప్రకటించగా, మరోవర్గం నేత కంది శ్రీనివాస్‌రెడ్డికి అనుకూలంగా పలువురు నిరసనవ్యక్తం చేశారు. విజయోత్సవ సభ సాక్షిగా పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
సభలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంపైనా విమర్శలు వచ్చాయి. ఆదిలాబాద్‌కు యూనివర్సిటీని త్వరలో మంజూరు చేస్తామని చెబుతూనే కాంగ్రెస్ నాయకులు ఏకాభిప్రాయానికి రావాలని ఆయన సూచించారు. యూనివర్సిటీని ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయమంటారని, అందరూ కలిసి చర్చించుకొని తనకు తెలుపాలని కోరారు.
పార్టీలో ఏకాభిప్రాయం లేదంటూనే ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం రేవంత్ చెప్పడం కొసమెరుపు. ఇక మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ విషయంలో సీఎం వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. కేంద్రంతో చర్చించి తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే ప్రైవేటు కంపెనీతో ప్రారంభించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలతో ప్రారంభించడమేంటనే ప్రశ్న స్థానిక ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు విషయంలో మరోసారి పాత పాటే పాడారు.
ఓవైపు సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగానే మహిళలు వెనుదిరగడం ప్రారంభించారు. సీఎం గంటన్నర ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకోగా, సభ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. దీంతో పలువురు దూర ప్రాంతాల నుంచి వచ్చామని చెబుతూ వాటిని తీయమని పోలీసులను కోరడం కనిపించింది.
సీఎం రేవంత్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో గురువారం పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. బీఆర్ఎస్వీ నాయకులు బుట్టి శివకుమార్, కలీం, రా జన్న, ఆదిలాబాద్ రూరల్ మండల మాజీ అధ్యక్షుడు గండ్రత్ రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు సీఐటీయూ జిల్లా కార్యదర్శి అనుమోల్ల కిరణ్, పీడీఎస్‌యూ, ఏఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శులు మడావి గణేశ్, సలాం వరుణ్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.