యాదగిరిగుట్ట: సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటన సందర్భంగా కాంగ్రెస్ (Congress) నాయకులు హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు తమను ఆలయం లోపలికి పంపించకపోవడంతో కొండపై ఆందోళనకు దిగారు. పోలీసుల జులం నశించాలంటూ నినాదాలు చేశారు. మంత్రులతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా యాదాద్రీశుడిని దర్శింకున్నారు. ఈ సందర్భంగా యాదిగిరి కొండపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఎంపీపీలను గుడి లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీ నాయకులమైన తమకు ముఖ్యమంత్రిని కలడానికి మీ అనుమతులు ఎందుకంటూ ప్రశ్నించారు. అక్కడే ఉన్న పార్టీ శ్రేణులు పోలీసుల జులం నశించాలంటూ నినాదాలు చేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత నాయకులు పోలీసులను దాటుకుని ఆలయంలోకి వెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది.