వెల్గటూర్, జూలై 25 : ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతారు. కానీ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం వెంకటాపూర్‌లో అధికార పార్టీ నాయకులే సర్కారు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కురిసిన వర్షానికి వెల్గటూర్ మండలం వెంకటాపూర్ బస్టాండ్ నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డు బురదమయమైంది.
దీంతో గ్రామస్థుల ఇబ్బందులను చూడలేక కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బిల్లకూరి తిరుపతి బురదమయమైన రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్థులతో కలిసి వరి నాట్లువేసి నిరసన తెలిపారు. మూడు నెలల క్రితమే ఈ రహదారి పనులకు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభించలేదని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి పనులు ప్రారంభించాలని కోరారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో ఆ పార్టీ నాయకులే నిరసన తెలుపడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.