RRR | హైదరాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు వ్యవహారం ఒక అడుగు ముందుకు- రెండడుగులు వెనక్కు అనే చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న దక్షిణభాగం రోడ్డు అలైన్మెంట్ ఇప్పటికే అష్టవంకరలు తిరుగుతుండగా, గతంలో ఖరారుచేసిన ఉత్తరభాగం రోడ్డు అలైన్‌మెంటును మార్చాలనే డిమాండు రోజురోజుకూ బలపడుతున్నది. అలైన్మెంట్లో మార్పులు చేస్తే తప్ప పనులు మందుకు సాగనిచ్చేదిలేదని రైతులు స్పష్టం చేస్తుండగా, దాదాపు 80% భూసేకరణ పూర్తయిన ప్రస్తుత దశలో అలైన్మెంట్ మార్పు సాధ్యం కాదని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) స్పష్టం చేస్తున్నది. అంతేకాకుండా, మొత్తం భూసేకరణ పూర్తయ్యాకే టెండర్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది.
ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగం సంగారెడ్డి సమీపంలో మొదలై చౌటుప్పల్ వరకు సాగుతుంది. అక్కడినుంచి దక్షిణభాగం మొదలై సంగారెడ్డి వద్ద ముగుస్తుంది. అయితే, దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను మొదట అనుకున్నవిధంగా కాకుండా అనేక మార్పులు చేసినట్టు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటుచేసిన ప్రభు త్వం… దక్షిణభాగం ట్రిపుల్ ఆర్కు సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నది. అయితే, ఉత్తర, దక్షిణభాగం రోడ్డు కలుస్తున్న ప్రాంతంలో ఇంటర్చేంజ్ జంక్షన్లను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. దీనికోసం భారీగా భూసేకరణ చేయాల్సి ఉన్నందున స్థానిక రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకోవడంలేదు. యాదాద్రి, రాయిగిరి ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు రోడ్డుతోపాటు సాగునీటి కాలువ కోసం భూములు కోల్పోయినందున మరోసారి రోడు ్డకోసం తాము భూములు ఇచ్చేది లేదని భీష్మించారు.
కొందరు స్థానిక నాయకులు అలైన్‌మెంట్‌ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు. కొందరు తమవారి భూముల్లో నుంచి రోడ్డు వెళ్లకుండా మార్పు కోరుతుంటే, మరికొందరు తమ భూములకు సమీపం నుంచి రోడ్డు వెళ్లే విధంగా మార్చాలని పట్టుబడుతున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సందర్భంలో అలైన్‌మెంట్‌ను మారుస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో అలైన్మెంట్ మార్చాల్సిందేనని స్థానిక నాయకులు మంత్రిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల వారు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కలిసి అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరినప్పటికీ ఆయన అంగీకరించలేదని తెలిసింది. అధికారులు సైతం టెండర్ల ప్రక్రియకు దగ్గరగా ఉన్న ప్రస్తుత సందర్భంలో అలైన్మెంట్ మార్పు సాధ్యంకాదని రైతులకు, స్థానిక నేతలకు స్పష్టం చేశారు.
ఇప్పటికే భూసేకరణ చాలావరకు పూర్తయినందున ఇప్పుడు అలైన్మెంట్ మారిస్తే. దాని ప్రభావం కొన్ని వందల ఎకరాలపై పడుతుంది. ఇప్పటికే సేకరించిన భూములను కాదని కొత్తగా భూసేకరణ చేపట్టాల్సి వస్తుంది. దీంతో కొత్తగా భూములు కోల్పోయేవారు ఆందోళనకు దిగే ఆస్కారం ఉంటుంది. వివాదం లేని ప్రాంతాల్లో సైతం భూములు ఇచ్చినవారు తమ భూములు తమకు అప్పగించాలనే డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. దాదాపు 80 శాతానికిపైగా భూసేకరణ పూర్తికావడంతో అవార్డులు పాస్ చేసేందుకు జాతీయ రహదారుల శాఖ సన్నాహాలు చేస్తున్నది.