Congress | వికారాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)/కొడంగల్: వచ్చే నెలలో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర ప్రజలకు కర్ణాటక రైతులు అప్రమత్తతో కూడిన హెచ్చరికలు జారీచేశారు. కాంగ్రెస్కు కనుక ఓటేస్తే నిండా మునుగుడు ఖాయమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం కునారిల్లిపోతుందని పేర్కొన్నారు. తమను గెలిపిస్తే నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తామంటే నమ్మి ఓటేశామని, ఇప్పుడు కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హామీలన్నీ బూటకమని, ఓట్లకోసమే ఆ పార్టీ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ సంక్షేమ, అభివృద్ధి పథకాలవంటివి దేశంలో ఎక్కడా లేవని, ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎం కేసీఆర్ను వదులుకోవద్దని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఆ పార్టీ వైఖరిని ఎండగడుతూ కర్ణాటక రైతులు బుధవారం కదంతొక్కారు.
గ్యారెంటీల పేరుతో చేసే మోసాన్ని నమ్మితే కాంగ్రెస్ నట్టేట ముంచుతుందని హెచ్చరించారు. తమలాంటి దుస్థితి రావొద్దంటే కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 200 మంది కర్ణాటకలోని కొంతన్పల్లి, మల్లాబాద్, సిలార్కోట్రికె, నాడెపల్లి, పాకాల్ కానడగ్గ ప్రాంతాల రైతులు కొడంగల్లో శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి కర్ణాటకలో కాంగ్రెస్ వైఫల్యాలను వివరించారు. ప్లకార్డులు చేబూని, నినాదాలు చేశారు.
కరెంటు లేదు.. బియ్యం లేవు
కాంగ్రెస్ను నమ్మి మోసపోయినట్టే తెలంగాణలోనూ జరగవద్దనే తాపత్రయంతో నిజాలు వివరించడానికి వచ్చామని కర్ణాటక రైతులు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు అంటూ ఇచ్చిన హామీ సక్రమంగా అమలు కావడం లేదని, బస్సులో కొట్లాటతో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు చనిపోయారని చెప్పారు. కాంగ్రెస్కు ఓటేస్తే ఆగం కావాల్సిందేనని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
గత ప్రభుత్వంలో కనీసం 8 గంటల కరెంటు ఉండేదని, కాంగ్రెస్ వచ్చిన తరువాత 3 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నదని వాపోయారు. పేదలకు 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి 3 కిలోలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. 200 యూనిట్ల కరెంట్ ఉచితమని చెప్తూ, ఆపై కరెంటు వాడితే రెండు రెట్లు ఆదనంగా బిల్లులు వసూలు చేసి రైతులను దోచుకొంటున్నారని మండిపడ్డారు. యువనిధి పథకం అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ, హామీగానే మిగిలిపోయిందని, నేటి వరకు అమలుకు నోచుకోలేదని తెలిపారు.
అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
కర్ణాటకలో తాము పడుతున్న బాధలను చెప్పుకోవడానికి వస్తే, కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని ప్లకార్డులను విరగ్గొట్టారని కర్ణాటక రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ బాగోతం బయటపడుతుందనే భయంతోనే ఇలా చేశారని ఆరోపించారు. కాం గ్రెస్ అధికారంలోకి రాకముందే ఈ విధంగా దౌర్జన్యం నడుస్తుందని, అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పాలన ఏవిధంగా ఉంటుందో తెలంగాణ ప్రజలు గుర్తించాలని కోరారు.
రైతులకు ఆత్మహత్యలే శరణ్యం
కాంగ్రెస్ను నమ్ముకున్నందుకు కర్ణాటక రైతులకు ఆత్మహత్యలే మిగిలాయి. నాకు మా గ్రామం అనంతపురంలో రెండున్నర ఎకరాల పొలం ఉన్నది. గతంలో పెసర, కంది పండించాను. తక్కువ పంట వచ్చింది. ప్రస్తుతం జొన్న వేశాను. వర్షాలు లేక, పొలంలో బోర్ ఉన్నప్పటికీ కరెంటు లేక పొలానికి నీటిని అందించలేకపోతున్నా. రైతులకు ప్రభుత్వం ఎటువంటి మేలు చేయడం లేదు. వ్యవసాయాధికారులూ అందుబాటులో ఉండరు. తెలంగాణలో మాదిరిగా రైతుల పంట కొనుగోలు కేంద్రాలు కర్ణాటకలో ఎక్కడా కనిపించవు.
– శ్రీనివాస్, అనంతపురం గ్రామం
కరెంటు లేక పంటలు ఎండుతున్నయ్
నా పేరు వెంకటయ్య. మాది మన్సాన్పల్లి గ్రామం. నాకు 6 ఎకరాల పొలం ఉన్నది. ప్రస్తుతం కంది, జొన్న పండిస్తున్నా. వర్షాల్లేక చెరువుల్లో నీళ్లు లేవు. బోర్లు ఉన్నా కరెంటు లేక పంటలకు నీళ్లు అందించలేకపోతున్నాము. దాంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇంతకు ముందున్న ప్రభుత్వం లో కనీసం 8 గంటల కరెంటు వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజు లో 3 గంటల కరెంటు మాత్రమే వస్తున్నది. ఎప్పుడు కరెంటు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. వచ్చే మూడు గంటలతో ఎకరం పొలానికి నీళ్లను అందించలేకపోతున్నాం.
– వెంకటయ్య, మన్సాన్పల్లి గ్రామం