KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో కరువు కనిపిస్తుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కార్యకర్తల సమన్వయ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ఓటు వేయనందుకు బాధపడుతున్నామని రైతులు చెబుతున్నారని తెలిపారు.
కాళేశ్వరంపై కావాలనే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. 83 పిల్లర్లలో 3 పిల్లర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయలేకపోతుందని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉంటే తెలంగాణ ఇలాగే ఉండేదా అని ప్రశ్నించారు. వెంటనే మేడిగడ్డ రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇస్తుండే అని అభిప్రాయపడ్డారు. అబద్ధాలు చెప్పి ఎన్నికల ముందు ప్రజలను రెచ్చగొట్టాడని తెలిపారు. అసలు ముఖ్యమంత్రిలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడా? అని విమర్శించారు. రేవంత్ రెడ్డి భాష చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ లేదని అన్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే.. ఇప్పటికే మేడిగడ్డ రిపేర్ అయ్యేదని అన్నారు. రాజకీయాలు పక్కన బెట్టి రేవంత్ రెడ్డి సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వాళ్లు కూడా అసలు ఊహించలేదని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చారని విమర్శించారు. 420 హామీలు ఇచ్చి.. 6 గ్యారెంటీలే అని చెబుతున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మీ చెక్కుతో పాటు బంగారం కోసం ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్కు ఓటు వేయనందుకు బాధపడుతున్నామని రైతులే చెబుతున్నారని అన్నారు.
మతం పేరుతో రెచ్చగొట్టడం తప్ప బీజేపీ ఎంపీ బండి సంజయ్కు ఏం చేత కాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్.. పార్లమెంటులో హాజరు కాడని విమర్శించారు. బండి సంజయ్ ప్రజల సమస్యలను పార్లమెంటులో వినిపించలేడని అన్నారు. ఎందుకంటే పార్లమెంటులో మాట్లాడాలి అంటే హిందీ, ఇంగ్లీష్ రావాలి.. కానీ బండి సంజయ్కు ఆ భాషలు రావని అన్నారు. కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. కరీంనగర్ కోసం కొట్లాడే నాయకుడు ప్రజల కోసం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.