Singur Lands | సంగారెడ్డి, జూన్ 19(నమస్తే తెలంగాణ): సింగూరు ముంపు భూముల్లో ఓ మంత్రి బామ్మర్ది భూదందాను మరువక ముందే.. అదే మంత్రి అనుంగు అనుచరుల భూదాహం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నది. అక్రమంగా చేపల చెరువులను ఏర్పాటుచేసిన మంత్రి అనుచరులు.. ముంపు భూములను సొంతం చేసుకొనే కుట్రకు తెరలేపారు.
ప్రభుత్వ, అసైన్డ్భూముల కబ్జాతో కడుపునిండని ఆ కాంగ్రెస్ నేతలు ఏకంగా సింగూరు ముంపు భూములనే చెరబడుతున్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాదిరాబాద్, మాసాయిపేట గ్రామాల పరిధిలో మంత్రి బామ్మర్ది సుమారు 200 ఎకరాల సింగూరు ముంపు భూములపై కన్నేయగా, మరోవైపు మంత్రి అనుచరులు ఖాదిరాబాద్, నిర్జప్ల, దేవునూరు తదితర గ్రామాల్లోని ముంపుభూముల్లో అక్రమంగా చేపల చెరువులను ఏర్పాటుచేసి వాటిని సొంతం చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు.
చేపల చెరువుల కోసం స్థానిక మత్స్యకారులకు భూములు లీజుకిస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన మత్స్యకారులకు ఆ భూములను లీజుకిచ్చి లక్షలు దండుకుంటున్నారు. సింగూరు ముంపు భూముల్లో చేపల చెరువుల ఏర్పాటును ‘నమస్తే తెలంగాణ’ ఇటీవలే వెలుగులోకి తీసుకురాగా, గత రెండురోజులుగా అధికారులు తూతూ మంత్రంగా చేపల చెరువులను కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులకు చెందిన భూముల్లో ఏర్పాటుచేసిన చేపల చెరువుల జోలికి మాత్రం వెళ్లడంలేదు. అధికారుల చర్యలతో చేపలు పెంచుతున్న ఆంధ్రాప్రాంత మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి చేపల చెరువులు నిర్మిస్తే వాటిని కూల్చివేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని కన్నీరు మున్నీరు అవుతున్నారు.
వట్పల్లి మండలంలోని ఖాదిరాబాద్, నిర్జప్ల, భూత్కూరు, దేవునూరు, ఉసిరికపల్లి, దరకాస్పల్లి గ్రామాల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు ముంపు పరిధిలో చేపల చెరువుల కోసం వందలాది ఎకరాలను లీజుకిచ్చారు. ఈ లీజు వెనుక మంత్రి అనుచరులైన కాంగ్రెస్ ముఖ్య నేతల హస్తమున్నది. తొలుత ముంపుభూములు తమవేనంటూ చేపల చెరువులను లీజుకిచ్చారు. కొంతమంది పట్టాదారుల భూములు సైతం తమవేనంటూ చేపల చెరువులకు లీజుకిచ్చి లక్షలు దండుకొంటున్నారు. వట్పల్లి మండల కాంగ్రెస్ ముఖ్యనేతతోపాటు, మండలస్థాయి ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు చేపల చెరువులను లీజుకిచ్చిన వారిలో ఉన్నారు. ఖాదిరాబాద్లో 53 ఎకరాల ముంపు భూములు, నిర్జప్లలో 43 ఎకరాలు, భూత్కూరులో 25 ఎకరాలు, దేవునూరులో 15 ఎకరాలు, ఉసిరికపల్లిలో ఎనిమిది ఎకరాలు, దరకాస్పల్లిలో నాలుగు ఎకరాల ముంపుభూములను చేపల చెరువుల కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేపల చెరువుల కోసం లీజుకిచ్చారు.
ఒక ఎకరం లీజుకు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు మత్స్యకారుల నుంచి కాంగ్రెస్ నేతలు వసూలు చేశారు. సింగూరు ప్రాజెక్టు ముంపుభూములతోపాటు సింగూరు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన పట్టాదారుల భూములను సైతం కాంగ్రెస్ నాయకులు ఆంధ్రాప్రాంత మత్స్యకారులకు లీజుకిచ్చి డబ్బులు దండుకుంటున్నారు. స్థానిక మత్స్యకారులకు లీజుకిస్తే తమ పేర్లు బయటకొస్తాయని గ్రహించిన కాంగ్రెస్ నేతలు.. ఆంధ్రా మత్స్యకారులను తీసుకొచ్చి వారికే ఆ ముంపుభూములను లీజుకు కట్టబెట్టారు. కాంగ్రెస్ నాయకులతోపాటు నిర్జప్ల గ్రామంలో ఓ పోలీస్ అధికారి 14 ఎకరాల భూమిని ఆంధ్రాప్రాంత మత్స్యకారులకు లీజుకిచ్చారు.
సింగూరు ప్రాజెక్టు ముంపుభూముల్లో నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ లెవల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వాటిని తొలగించాల్సి ఉంటుంది. ఖాదిరాబాద్, నిర్జప్ల, ఉసిరికపల్లి, దేవునూరు, భూత్కూరు, దరకాస్పల్లి గ్రామాల్లో ముంపుభూములను లీజుకు తీసుకొన్న ఆంధ్ర మత్స్యకారులు నిబంధనలకు విరుద్ధంగా ఒకటి నుం చి ఐదెకరాల విస్తీర్ణంలో చేపల చెరువులను నిర్మించుకొన్నారు. మంజీరా నది నుంచి కాలువలు, పైపులైన్లు వేసి చేపల చెరువుల్లో నీటిని నింపి చేపలు పెంచుతున్నారు. చెరువుల్లో పలురకాల రసాయనాలను మత్స్యకారులు వాడుతున్నారు. కలుషితమైన ఈ నీటిని తిరిగి మం జీరా నదిలోకి వదులుతుండటంతో ఆ నదీజలాలు కలుషితమవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా ముంపుగ్రామాల్లో చేపల చెరువుల నిర్మాణం చేపట్టడంపై ‘నమస్తే తెలంగాణ’ పలు కథనాలను ప్రచురించింది. దీంతో చేపల చెరువులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. అప్పటివరకు కాంగ్రెస్ నేతల ఒత్తిడితో అటువైపు కన్నెత్తిచూడని అధికారులు విధిలేక చేపల చెరువులను కూల్చివేయానికి నడుంబిగించారు. గత రెండురోజులుగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఖాదిరాబాద్, నిర్జప్ల తదితర గ్రామాల్లో తూతూమంత్రంగా చేపల చెరువులను కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు లీజుకిచ్చిన చేపల చెరువుల జోలికి మాత్రం అధికారులు వెళ్లడంలేదు.
సింగూరు ముంపు భూములను సొంతభూముల్లా చేపల చెరువులకు లీజుకిచ్చిన కాంగ్రెస్ నాయకులు ఆ భూములను సొంతం చేసుకొనేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇందుకోసం ఆ భూముల్లోకి విద్యుత్తు కనెక్షన్ల కోసం ట్రాన్స్కో పేరిట డీడీలు చెల్లించారు. డీడీలను పరిశీలించి కరెంటు కనెక్షన్లు ఇచ్చేందుకు ట్రాన్స్కో అధికారులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నాయకులు లీజుకిచ్చిన ఆ భూముల్లో వారిపేరిట కరెంటు కనెక్షన్లు వచ్చాక ఆ భూములను తమవిగా పేర్కొంటూ రెవెన్యూ రికార్డులు తారుమారు చేసుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తున్నది.