Komatireddy | హైదరాబాద్, జులై 19(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పైకి తామిద్దరం కలిసే ఉన్నట్టు చెప్పుకొంటున్నప్పటికీ అంతర్గతంగా ఒకరి నిర్ణయాలను మరొకరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో కొత్తగా పార్టీ చేరికలను రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తుంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో పార్టీ బలంగానే ఉన్నదని, కొత్తగా చేరికలేమీ అవసరం లేదని తేగేసి చెప్తున్నారు. కొత్తగా వచ్చేవారు చేసేదేమీ లేదని తేల్చి చెప్తున్నారు.
గురువారం ఢిల్లీలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వేముల వీరేశం, శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిసింది. ఈ ఇద్దరి చేరికపై కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓడిన నేతలను చేర్చుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అయితే రేవంత్‌రెడ్డి మాత్రం ఎప్పటి మాదిరిగానే తన ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్తున్నారని కోమటిరెడ్డి వర్గం విమర్శలు గుప్పిస్తున్నది. నల్లగొండ జిల్లాలో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ద్వారా ఇటు కోమటిరెడ్డికి, అటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇందులో భాగంగానే ఈ ఇద్దరు నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ తాజాగా చేరికలను ప్రోత్సహిస్తున్నారని చెప్పుకుంటున్నారు.