నంగునూరు, జూలై 2 : కాంగ్రెస్ నాయకుల వేధింపులకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. గంటల తరబడి ప్రభుత్వ కార్యాలయల్లో తిష్టవేసి తమ కార్యకర్తలకు, తాము చెప్పిన వారికి మాత్రమే పనులు చేయాలని హుకుం జారీ చేస్తుండటంతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండల అధికారులు హడలిపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమ ప్రమేయం లేకుండా అమలు చేయొద్దని కాంగ్రెస్ నాయకులు ఆదేశాలు జారీ చేస్తుండటంతో తాము అర్హులకు న్యాయం చేయలేకపోతున్నామని అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రోజూ మండల పరిషత్, తహసీల్ కార్యాలయాల్లో గంటల తరబడి తిష్టవేసి పైరవీలు చేస్తుండటంతో అధికారులు తమ పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేయలేనని మండల పరిషత్ పర్యవేక్షకుడు ప్రభాకర్‌రావు సిద్దిపేట కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 35మంది కాంగ్రెస్ నాయకులు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కొని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రభాకర్‌రావు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను మిరుదొడ్డి, దుబ్బాక మండలాలకు బదిలీ చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. మండలంలోని ఇతర శాఖల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని పలువురు అధికారులు తమ సన్నిహితుల వద్ద తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నట్టు సమాచారం.