గణపురం, మే 19 : కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై కాంగ్రెస్ నాయకుడి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా బుర్రకాయలగూడెంలో సోమవారం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మరో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
రెండు కేంద్రాల నిర్వాహకుల మధ్య కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఐకేపీ కేంద్రంలో ధాన్యాన్ని మిషన్ భగీరథ నీటితో తడపడంతో నిర్వాహకులు సదరు నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మహిళలు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లగా మాజీ ఎంపీటీసీ అనుచరులు గొడవకు దిగారు. మహిళలపై దాడి చేయడంతో రేణుక, శ్రీదేవికి తీవ్ర గాయాలై స్పృహ కోల్పోవడంతో స్థానికులు 108 వాహనంలో భూపాలపల్లిలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం రేణుక అపస్మారక స్థితిలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు.