హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో (Congress) రెండో జాబితా చిచ్చురేపుతున్నది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన తమను కాదని మరొకరికి టికెట్లు కేటాయించడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఊగిపోతున్నారు. పార్టీ అధినాయకత్వంతో తాడోపేడో తేల్చుకుంటామంటూ ప్రకటిస్తున్నారు. తమ అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల లేదా నారాయణపేటల్లో సీటు ఆశించిన ఎర్రశేఖర్.. తనకు పోటీచేసేందుకు అవకాశం కల్పించకపోవడం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మరికాసేపట్లో తన అనుచరుగణంతో సమావేశం కానున్నారు. వనపర్తిలో చిన్నారెడ్డికి టికెట్ రావడంతో మేఘారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. దేవరకద్ర టికెట్ ఆశించిన ప్రదీప్‌కుమార్ గౌడ్‌కు భంగపాటు తప్పలేదు. అక్కడ మదన్‌రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది.
కామారెడ్డి కాంగ్రెస్‌లో అసంతృప్తి నెలకొన్నది. ఆ పార్టీ సీనియర్ నేత సుభాష్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనను కాదని మదన్మోహన్ రావుకు అధిష్ఠానం సీటు కేటాయించడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్లు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసినప్పటికీ తనను గుర్తించలేదంటూ ఊగిపోతున్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడులోనూ అసమ్మతి భగ్గుమన్నది. రెండు రోజుల క్రితమే పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో.. చలమల కృష్ణారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. చౌటుప్పల్‌లో నేడు తన అనుచరులతో సమావేశమవనున్నారు. నియోజకవర్గం పరిధిలోని సంస్థాన్‌నారాయణపురం మండలం గుజ్జలో కృష్ణారెడ్డి వర్గీయులు రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. హుస్నాబాద్ టికెట్ల కేటాయింపు చిచ్చురాజేసింది. టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.
పార్టీ రెండో జాబితా హైదరాబాద్‌లో నేతలూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన తన అనుచరులతో సమావేశం కానున్నారు. ఇక్కడ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను పార్టీ బరిలోకి దింపింది. మహేశ్వరం టికెట్ తనదేనంటూ ఇన్నాళ్లూ నమ్మకంగా చెబుతూ వస్తున్న పారిజాత నర్సింహారెడ్డికి నిరాశే ఎదురయింది. తనకు సీటు దక్కకపోవడంతో ఆమె తన అనుచరులతో సమావేశమవుతున్నారు. ఎల్బీనగర్లో ఇన్నాళ్లుగా పనిచేస్తున్న తనను కాదని నాన్‌లోకల్ మధు యాష్కికి టికెట్ ఇవ్వడంతో మల్రెడ్డి రాంరెడ్డి అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కూకట్‌పల్లిలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. బండి రమేష్‌కు టికెట్ కేటాయించడంతో స్థానిక నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ భవిష్యత్ కార్యాచరణను నేడు వెల్లడిస్తామని ప్రకటించారు. శేరిలింగంపల్లి టికెట్ ఆశించిన రఘనాథ్ యాదవ్ భంగపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. తనకు కాకుండా మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ రావడంతో దండెం రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.