హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా భూతాన్ని సృష్టించి, ఇండ్ల మీదకి పంపి పేదలకు నిలువనీడ లేకుండా చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన నేతలు హైడ్రా గురించి మీనాక్షి దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. హైడ్రా పేదల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదని పేర్కొన్నట్టు సమాచారం. ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోయినా తాము ఏమి అడగలేదని, కానీ కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించుకున్నందుకు ఇడ్లను కూల్చి వేయడం ఎంతవరకు ధర్మమని కార్యకర్తలు నిలదీస్తున్నారని నేతలు చెప్పారు.
ఎటువంటి నోటీసులు లేకుండా ఇండ్లను కూల్చి వేస్తున్నారని, ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వాపోయారు. అధికారులు సెలవు దినాలను చూసుకుని ఇండ్లు కూల్చడమేంటని, ఇలాంటి ధోరణితోనే పార్టీకి తీరని నష్టం జరిగిందని గోడు చెప్పుకున్నారు. హైడ్రా దెబ్బతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిపోయిందని, నిర్మాణ రంగం ఆగిపోయిందని ఫిర్యాదులో పేర్కొనట్టు తెలిసింది. ఈ రంగం మీద ఆధారపడిన యువత ఏకంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వానికి పేదలు, పార్టీ నేతల గోడు పట్టడంలేదని చెప్పారు. అధికారులు పెద్దోళ్లను వదిలిపెట్టి, పేదల ఇండ్ల మీద పడుతున్నారని, హైడ్రాపై ప్రత్యేక దృష్టి పెట్టి, రద్దు చేయించాలని వారు ఫిర్యాదులో కోరినట్టు తెలుస్తున్నది.