ఇల్లంతకుంట, మే 11 : పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలని సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో రైతులు ధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో పంటను అమ్ముకోవడానికి కూడా ధర్నా చేయాల్సి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నెల రోజుల క్రితం వేరుశనగ పోసినా ఇప్పటి వరకు తూకం వేయడం లేదని మండిపడ్డారు. అధికారులు మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ సురేశ్ అక్కడికి వచ్చి నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.