పర్వతగిరి, నవంబర్ 4: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎదుటే కాంగ్రెస్ శ్రేణులు గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రాగా, గతంలో ఏర్పాటు చేసిన స్థలంలో కాకుండా మరోచోట ఏర్పాటు చేయడం గొడవకు దారి తీసింది. దీంతో పోలీసులు, ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ధాన్యం సేకరణలో సమస్యలు ; పరిష్కరించండి: సీఎం
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించాలని చెప్పారు. సమస్యలను తక్షణమే పరిషరించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆదిలాబాద్(కృష్ణ ఆదిత్య), కరీంనగర్(ఆర్వీ కర్ణన్), నిజామాబాద్ (ఏ శరత్), మెదక్(హరిచందన దాసరి), వరంగల్(టీ వినయకృష్ణా రెడ్డి), ఖమ్మం(కే సురేంద్ర మోహన్), నల్లగొండ(అనితా రామచంద్రన్), రంగారెడ్డి(డీ దివ్య), మహబూబ్నగర్(రవి) ఉమ్మడి జిల్లాలకు అధికారులను నియమించింది.