తిమ్మాపూర్, మార్చి19: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నివాసంపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. బుధవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలోని బాలకిషన్ ఇంటిపైకి పెద్ద సంఖ్యలో నాయకులు వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. తిమ్మాపూర్ మండలం నుంచి తరలుతున్న కాంగ్రెస్ నాయకులు మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్‌రావు, కొత్త తిరుపతిరెడ్డి, దావు సంపత్‌రెడ్డి, మాచర్ల అంజయ్య, కార్యకర్తలను రేణికుంట టోల్గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలోని బాధితులకు ఇవ్వాల్సిన సీఎంఆర్ఎఫ్లో రూ.6కోట్ల స్కాం చేశారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆరోపణలు నిరూపించాలంటూ బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు కాంగ్రెస్ నాయకులు సవాల్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు బెజ్జంకి మండలం గుండారంలోని రసమయి ఇంటిపై దాడికి యత్నించారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
కవ్వంపల్లి సత్యనారాయణ చేసే కమీషన్ల పాలనపై ప్రశ్నిస్తూనే ఉంటానని, ఎవరికీ భయపడేదేలేదని గుండారంలోని తన ఇంటిలో హౌస్ అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఒక వీడియో సందేశాన్ని కార్యకర్తలకు విడుదల చేశారు. పెద్దలింగాపూర్‌లోని రైతులు నీళ్లు రాక ధర్నా చేస్తుంటే, కవ్వంపల్లి రంగులు పూసుకుంటున్నాడని ఇటీవల మాట్లాడినందుకు కార్యకర్తలతో తన ఇంటిపై దాడిచేసేందుకు కుట్రకు తెరలేపారని మండిపడ్డారు.
రసమయి బాలకిషన్ ఇంటిపై దాడికి యత్నించిన కాంగ్రెస్ చర్యకు నిరసనగా బీఆర్ఎస్ తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ ఆధ్వర్యంలో నుస్తులాపూర్ స్టేజీ వద్ద ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మ దహనం చేశారు. కవ్వంపల్లి ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అవినీతిని ప్రశ్నిస్తే కార్యకర్తలను, అనుచరులను ఉసిగొల్పి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిపైకి దాడి చేసే పన్నాగం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. రసమయి బాలకిషన్ భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.