Palla Rajeshwar Reddy | జనగామ, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజకవర్గంలోని ఎర్రగుంటతండాలో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన సభ రసాభాసగా, రక్తసిక్తంగా మారింది. ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలను పేదలందరికీ అందించాలని కోరిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. పోలీసు అధికారుల సమక్షంలోనే పథకం ప్రకారం వెంటతెచ్చుకున్న రాళ్లు, కోడిగుడ్లు, టమాటలతో దాడి చేశారు. దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు.. తండావాసులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. జనగామ అర్బన్ సీఐ దామోదర్‌రెడ్డి కర్రలు విరిగే వరకు చితకబాదారు. పోలీసుల లాఠీచార్జీలో 16 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు గాయాలు కాగా, కాంగ్రెస్ నాయకులు విసిరిన రాళ్లు, కోడిగుడ్లు తగిలి నలుగురు మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. ఎర్రగుంటతండాలో ఉద్రిక్తత నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లారు. దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే పల్లా ప్రజాపాలన వేదికపై బైఠాయించగా పోలీసులు అరెస్టుచేసి జనగామ స్టేషన్‌కు తరలించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జనగామ పర్యటన సందర్భంగా శనివారం రాత్రి నుంచే నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తండాలో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని తండావాసులు సభావేదిక వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ఎమ్మెల్యే పల్లా గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. సీఐ దామోదర్‌రెడ్డి దగ్గరుండి మరీ సీఎం రేవంత్‌రెడ్డి పాటలను పెట్టించి కాంగ్రెస్ నాయకులు డ్యాన్స్‌లు చేసేలా రెచ్చగొట్టారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యే పల్లా ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక కాంగ్రెస్ పార్టీ సభానా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరింత రెచ్చిపోయిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపైకి దాడి చేసేందుకు దూసుకెళ్లారు. బీఆర్ఎస్ కార్యకర్తలను సీఐ విచక్షణారహితంగా చితకబాదాడు. బీఆర్ఎస్ కార్యకర్త ప్రమోద్‌రెడ్డి చేతివేలు చితికిపోగా, బీఆర్ఎస్ వెంకిర్యాల గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి అశోక్‌కు రక్తస్రావమైంది. గానుగపహాడ్ మాజీ సర్పంచ్ గుర్రం కుమార్, కార్యకర్తలు భూంరెడ్డి, రెహమాన్‌తో పాటు మరో 16 మందికి దెబ్బలు తగిలాయి. మంత్రి సభ రద్దయిన తర్వాత పోలీసులు ఎమ్మెల్యే పల్లాను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అధికారులే సభను నిర్వహించగా, సమావేశం ముగిసే సమయానికి వచ్చిన జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వేదికపై లబ్ధిదారులతో ఫొటోలు దిగారు.
ఆదివారం రాత్రి జనగామలోని క్యాంపు కార్యాలయంలో ఎర్రగుంటతండా మాజీ సర్పంచ్ గుగులోత్ మంజుల, బీఆర్ఎస్ నాయకురాలు శారద, ఇతర నేతలు, పోలీసుల లాఠీదెబ్బలతో గాయపడ్డ యువకులు, గ్రామస్థులతో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ చౌకబారు ఎత్తుగడలతో చేస్తున్న దాడులకు అదరం.. బెదరం అని స్పష్టంచేశారు. ప్రజల పక్షాన నిలబడుతా.. ప్రభుత్వంతో కలబడుతా అని తేల్చిచెప్పారు. అర్హులైన వారికి పథకాలు అందేవరకు కొట్లాడుతూనే ఉంటానని, జనగామ ప్రాంత సమస్యలను మంత్రికి విన్నవించి నిధులు సాధించుకుందామని చూస్తే బయటనుంచి తెచ్చుకున్న జనాలతో కలిసి కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడితే సీఐ దామోద్‌రెడ్డి స్వయంగా వారిని ఉసిగొల్పాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను రెండు ప్లాస్టిక్ కర్రలు విరిగేలా కొట్టాడని తెలిపారు.
జనగామ జిల్లా ఎర్రగుంటతండాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు జరిపిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జీ పేరిట రక్తాలు వచ్చేటట్టుగా కొట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే లాఠీచార్జీ చేయిస్తారా? అని విరుచుకుపడ్డారు. నిర్బంధాలతో, లాఠీచార్జీలతో బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను భయపెట్టలేరని స్పష్టంచేశారు. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే హరించడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి పరాకాష్ట అని నిప్పులుచెరిగారు.
జనగామ జిల్లా ఎర్రగుంటతండాలో జరిగిన పోలీస్ లాఠీచార్జీని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. లాఠీలు విరిగేలా, రక్తాలు వచ్చేలా పోలీసులు విరుచుకుపడడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులపై పోలీసుల దురాగతం హేయమైన చర్య అని అభివర్ణించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అడిగితే లాఠీచార్జీలు, ప్రశ్నిస్తే అరెస్టులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎన్ని రోజులు నిర్బంధాలు, పోలీస్ పహారాలతో ప్రభుత్వాన్ని నడుపుతారని ప్రశ్నించారు. నిరంకుశంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.