మహబూబాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : అధికార కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఓ వైపు రేవంత్ సర్కార్.. సమస్యలు, హామీలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు వేసి వేధిస్తుండగా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టుపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడుతున్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా నమస్తే తెలంగాణ గార్ల మండల విలేకరి సోమయ్యపై మద్యంమత్తులో దౌర్జన్యం చేయడం కలకలం రేపింది. శనివారం సాయంత్రం ఇంట్లో ఉన్న సోమయ్యను కాంగ్రెస్ నాయకుడు దుర్గాప్రసాద్ రమ్మంటున్నాడని నాగేశ్వర్రావు, లెనిన్ తీసుకెళ్లారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తావా? అంటూ దాడికి దిగారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వారు వచ్చి వారిని అడ్డుకున్నారు.
ఆ తర్వాత విలేకరి సోమయ్య గార్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్లి మరోమారు సిబ్బంది ఎదుటే మద్యం మత్తులో దాడికి తెగబడ్డారు. ఇంతలో సోమయ్య కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఇతర పత్రికల విలేకరులు పోలీస్‌స్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సోమయ్యకు ప్రథమ చికిత్స చేసిన తర్వాత డాక్టర్ సలహా మేరకు ఖమ్మం దవాఖానకు తరలించారు. సోమయ్యపై దాడిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.