రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ)/గంభీరావుపేట: ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడిచేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో చోటుచేసుకున్నది. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో అధికారులు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు.
అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు అధికారులను ప్రశ్నించారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ‘అడగడానికి మీరెవ్వరు? అంతా మా ఇష్టం’ అంటూ బీఆర్ఎస్ నాయకులపై మూకుమ్ముడిగా దాడికి దిగారు. తమపై దాడిచేసిన కాంగ్రెస్ నాయకులు కొమిరిశెట్టి తిరుపతి, పర్శ హనుమాండ్లుపై బీఆర్ఎస్ గంభీరావుపేట పట్టణ అధ్యక్షుడు పెద్దవేని వెంకటియాదవ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గోగు లింగంయాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాడి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు బొల్లి రామ్మోహన్, జనగామ శరత్‌రావు, విజయరామారావు, గుండారపు కృష్ణారెడ్డి, చీటి లక్ష్మణ్‌రావు, వర్స కృష్ణహరి, సబ్బని హరీశ్ ఆధ్వర్యంలో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల నుంచి దాదాపు 200 మంది కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. జరిగిన ఘటనపై సీఐ శ్రీనివాస్‌గౌడ్ బీఆర్ఎస్ నేతలతో చర్చించారు. దాడి చేసిన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలంటూ వారు ఫిర్యాదు చేశారు. వారిపై కేసు నమోదు చేసేదాకా పోలీస్ స్టేషన్లో ఉంటామని పట్టుబట్టారు. విచారణ జరిపి, కేసు నమోదు చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన విరమించారు.
ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో పెట్టకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడంపై ప్రశ్నించారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని, పద్ధతి మార్చుకోకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.