పరకాల, మే 13: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయగా పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని నాగారంలో చోటు చేసుకుంది. గ్రామంలో ఎన్నికల జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి, చిట్టిరెడ్డి రత్నాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండెబోయిన నాగయ్య పోలింగ్ సరళిపై చర్చించుకుంటున్నారు.
కొంత మంది కాంగ్రెస్ శ్రేణులు వారిపై కర్రలతో దాడి చేయగా, రత్నాకర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. మాజీ ఎంపీటీసీ ఏరుకొండ శ్రీనివాస్ తన బైక్‌పై పెట్రోల్ పోసుకోవడానికి బస్టాండ్ వద్దకు వెళ్లగా అకారణంగా అతడిపై కూడా దాడి చేసి గాయపరిచారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు బాధితుల కుటుంబసభ్యులతో కలిసి కలిసి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.