హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ)/నమస్తే నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో సోమవారం పాలకవర్గాల ప్రమాణ స్వీకారం వేళ కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల దౌర్జన్యాలకు దిగారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు, పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులపై బెదిరింపులకు దిగారు. ఇదేంటని ప్రశ్నించిన బీఆర్ఎస్ క్యాడర్, ప్రజలపైనా దాడులకు పాల్పడ్డారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలపై పల్లెజనం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కంది శ్వేత ప్రమాణం చేస్తుండగా.. కాంగ్రెస్ మూకలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైక్ బంద్ చేయాలని అధికారులపై దౌర్జన్యం ప్రదర్శించారు. కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులపై దాడికి యత్నించారు. కుర్చీలు విసిరేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
వర్గల్లో కాంగ్రెస్ నాయకుల బరితెగింపు
సిద్దిపేట జిల్లా వర్గల్లో కాంగ్రెస్ నాయకులు బరితెగించారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ జయభారతి, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తుండగా కాంగ్రెస్ గూం డాలు వేదిక వద్దకు దూసుకొచ్చారు. అడ్డుకోబోయిన బీఆర్ఎస్ నాయకులను నెట్టేసి, పిడిగుద్దులు కురిపించారు. దీంతో పంచాయతీ ప్రాంగణం రణరంగంగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపు చేశారు. కాగా, కాంగ్రెస్ నాయకుల వైఖరిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జగదేవపూర్లోనూ బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రయత్నించారు. గ్రామస్తులు ప్రతిఘటించడంతో వెనక్కితగ్గారు.
హాజరుకాని 9 మంది వార్డు సభ్యులు
మంచిర్యాల జిల్లా పారుపల్లి పంచాయతీలో 9 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. రాజకీయ ఒత్తిళ్లతో ఉప సర్పంచ్ ఎన్నిక జరిగిందని, ఉప సర్పంచ్‌ను మార్చాలనే డిమాండ్‌తో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వార్డు సభ్యులు తెలిపారు.
ఓటేయలేదని బెదిరింపులు
ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు తమపై బెదిరింపులకు దిగి, ఇండ్లపైకి వచ్చి దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తూ సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా ఎంగంపల్లిలోని రహదారిపై బీఆర్ఎస్ మద్దతుదారులు ధర్నా నిర్వహించారు. ‘మీ అంతు చూస్తాం! ప్రభుత్వం మాదే.. ఊర్లో ఎలా ఉంటారో? ఎలా మనుగడ సాగిస్తారో?’ అంటూ అడుగడుగునా బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. కల్వకుర్తిలో సర్పంచ్ బంధువైన ఓ వ్యాపారిపై ముగ్గురు కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడ్డారని తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన బీఆర్ఎస్ మద్దతుదారులు సోమవారం కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చేరుకుని, ధర్నా నిర్వహించారు. ధర్నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులను మహిళలు నిలదీశారు. తమపై దాడులు చేస్తుంటే, బాధ్యులపై ఎందు కు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ధర్నాకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హాజరయ్యారు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ మూకల దాడి
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ ప్రమాణస్వీకారం కార్యక్రమం వద్ద కొందరు కాంగ్రెస్ నాయకులు గులాబీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. బీఆర్ఎస్ మద్దతుదారు గెలుపును జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు గత రెండు రోజులుగా గొడవలు సృష్టిస్తున్నారు. సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా, మైక్‌లో పెట్టిన పాటలపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరాలు వ్యక్తంచేయగా, నిలిపివేశారు. కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రారంభిస్తుండగా, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వార్డు సభ్యుడు మూడు రమేశ్‌పై కుర్చీతో దాడికి దిగారు. బీఆర్ఎస్ నాయకులు ఎదురు తిరగడంతో ఘర్షణ చోటుచేసుకున్నది. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను నిలువరించారు. అనంతరం అందుబాటులో ఉన్న సర్పంచ్, బీఆర్ఎస్ వార్డు సభ్యులతో ఎంపీడీవో ప్రమాణ స్వీకారం చేయించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా..!
వికారాబాద్ జిల్లా కొండాయపల్లిలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో అధికారుల నిర్వాకం బయటపడింది. కొండాయపల్లి ఉప సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి నిమ్మలి ఆశమ్మ పేరును తొలగించి, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి శిరీష పేరును చేర్చారు. దీంతో అధికారుల పనితీరును నిరసిస్తూ సోమవారం సర్పంచ్ ఆనంద్‌తోపాటు వార్డు సభ్యులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎంపీడీవో గ్యామ్యానాయక్, కార్యదర్శి ప్రభాకర్ వ్యవహారంపై పాలకవర్గ సభ్యులు మండిపడ్డారు. అధికార పార్టీ అక్రమాలకు వంతపాడుతూ ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో తమకు అన్యాయం చేయజూశారని ధ్వజమెత్తారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమ్యాండ్ చేశారు. దీంతో వారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని డీపీవో జయసుధకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా స్పందించలేదు.