హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతోనే కాంగ్రెస్ నేతలు ఈ భౌతిక దాడులకు తెగబడుతున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఆదేశాలతోనే కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయి, ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేసిన మోసాలపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. పదేండ్లపాటు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, నేడు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గూండాగిరీ తమ మారు పాలన అని కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుంటున్నదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అరాచక శక్తులకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని, ఇందిరమ్మ రాజ్యం పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్, తెలంగాణలో గూండారాజ్యాన్ని నడిపిస్తున్నదని కేటీఆర్ నిప్పులు చెరిగారు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని పోజులు కొట్టే రాహుల్ గాంధీకి, రేవంత్ పాలనలో అప్రజాస్వామిక చర్యలు కనిపించడం లేదా అని నిప్పులు చెరిగారు. రాహుల్ ఇప్పటికైనా హిపోక్రసీ కట్టిపెట్టి, కాం గ్రెస్ సరారును సరిదిద్దాలని సూచించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని చెప్పేందుకు బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ అరాచక చర్య కన్నా నిదర్శనం ఇంకేం కావాలని కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నవారిపై దాడులకు తెగబడుతున్న కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కార్యాలయాలకే రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు, మారుమూల పల్లెల్లో నివసిస్తున్న పేద, బడుగు బలహీనవర్గాల ప్రజలకు రక్షణ ఎకడ ఉంటుందని ప్రశ్నించారు. దాడులతో బీఆర్ఎస్ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయాలని చూడటం ముఖ్యమంత్రి అవివేకమేనని దుయ్యబట్టారు. సమైక్యరాష్ట్రంలో ఇంతకన్నా వందరెట్ల అణచివేతను, నిర్బంధాన్ని, దాడులను తట్టుకొని నిలబడిన తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా బీఆర్ఎస్ నిలిచిందని గుర్తుచేశారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కన్నెరజేస్తే కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగగలరా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలతో పాటు వారి వెనుక ఉన్న నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్దాడులు చేసినా.. ఎన్ని రకాల అక్రమ కేసులు బనాయించినా తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటం.. ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న రాష్ర్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.