అధికారంలోకి రాగానే మొదటి హామీగా ‘స్వేచ్ఛ’ ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకున్నది. కానీ రెండున్నరేండ్లుగా రాష్ట్రంలో బెదిరింపుల పాలన నడుస్తున్నది. దీనికి ముఖ్యనేత వర్గం నేతృత్వం వహిస్తున్నది. ప్రశ్నిస్తే నేరం.. భయపెట్టడమే సమాధానం అన్నట్టుగా మారింది. రైతులు ఎరువుల కోసం లైనులో నిలబడితే వేధింపులు, సామాన్యుడు కరెంటు కోతలపై మాట్లాడినా, కాలువల్లో నీళ్లు రావడం లేదని చెప్పినా కేసులు, ప్రభుత్వ పెద్దల అవినీతిని ప్రశ్నించే మీడియాపై కక్ష, పాలనా లోపాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రశ్నించినా, రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై మాట్లాడినా ప్రతిపక్ష పార్టీ నేతలపై బెదిరింపులు.. ఇలా రైతులు, మహిళలు, పేదలు, మీడియా, ప్రతిపక్ష నేతలు ఇలా అన్ని వర్గాలవారిపై నా నిరంకుశత్వం కొనసాగుతున్నది. ఈ విధానం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదు, సొంత పార్టీ నేతలకూ వేధింపులు తప్పడం లేదు. లీకుల కథనాలతో మంత్రులకు అవినీతి మరకలు అంటిస్తుండగా, ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడినే లక్ష్యంగా చేసుకొని వ్యతిరేక కథనాలు ప్రసారం అవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అభయ హస్తం కాస్తా ‘భస్మాసుర హస్తం’గా మారి సొంతవారినే బలితీసుకుంటున్నదని చెప్పుకొంటున్నారు.
హనుమకొండ, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభయ హస్తం, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పక్కనబెట్టింది. భయపెట్టడం, బెదిరించడం, వేధించడం, రౌడీయిజం, దుష్ప్రచారం వంటి విధానాలను ముఖ్యనేత వర్గం అమలు చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తమ కుటుంబీకులు, సన్నిహితులు ఏం చేసినా ఎవరూ ఏమీ మాట్లాడొద్దు, ప్రతిపక్ష నేతలే కాదు, అధికార పార్టీలోని ఇతర నేతలు కూడా అందులో జోక్యం చేసుకోవద్దు అనే తరహా రాజకీయం నడుస్తున్నదని అంటున్నారు. ఎవరైనా ప్రశ్నించినా, పోటీకి వచ్చినా అంతే సంగతులు. వేధింపుల రాజకీయం మొదలవుతున్నది. మంత్రులకు సంబంధించిన ఏవైనా ఆరోపణలు బయటికి వస్తే మొదట ‘ఏం కాదు’ అని భరోసా ఇవ్వడం, ఆ తర్వాత తమ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి, వాళ్లకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయించడం, సోషల్ మీడియాలో బదనాం చేయించడం, మానసికంగా వేధించి దారిలోకి తెచ్చుకోవడం.. చివరికి ‘మీరే దిక్కు’ అనేలా చేయడం ముఖ్యనేత రాజకీయ విధానంగా నడుస్తున్నదని చెప్తున్నారు. ముఖ్యనేత దాదాపు అరడజను మంత్రుల విషయంలో ఇలాంటి వ్యూహమే అమలు చేశారని, తాజాగా అధికార పార్టీ అధ్యక్షుడిపైనే ఈ అస్ర్తాన్ని ప్రయోగించారని గుర్తు చేస్తున్నారు. పీసీసీ చీఫ్‌పై వ్యతిరేక కథనాల నేపథ్యంలో ముఖ్యనేత బెదిరింపు రాజకీయాలపై కాంగ్రెస్‌లోని అందరికీ స్పష్టత వచ్చిందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే చెప్తున్నారు.
టార్గెట్ డిప్యూటీ సీఎం

కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన ముఖ్యనేత, మొదటి నుంచి అసలు కాంగ్రెస్ నేతలను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎత్తులు వేస్తున్నారనేది బహిరంగ రహస్యం. అయితే ముఖ్యనేత వేధింపుల రాజకీయం నుంచి ప్రభుత్వంలో రెండో స్థానంలోని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మినహాయింపు లేదని ఆరోపణలు ఉన్నాయి. కీలకమైన ఆర్థిక శాఖను ఆయనకు అప్పజెప్పినా ముఖ్యనేతకు నమ్మకంగా ఉండే ఉన్నతాధికారులను ఆ శాఖలో నియమించారు. పదేండ్ల తర్వాత అధికారం వచ్చిందని, సర్దుబాట్లు చేసుకోవాలని చెప్పి మరీ పన్నిన వ్యూహంలో ఉప మఖ్యమంత్రి చిక్కుకునేలా చేశారు. కొన్ని నెలలు వేచి చూసి సొంత మీడియాతోపాటు సోషల్‌మీడియాలో వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టించారు. పర్సంటేజీ మంత్రిగా ముద్రపడేలా చేశారు. 10 శాతం అని, 15 శాతం అని, చివరికి 20 శాతం కమీషన్ అంటూ, సొంత పార్టీ కాంట్రాక్టర్లను సైతం వదలడంలేదంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చర్చించుకునే వరకు ఈ ప్రచారం సాగింది.
అయినా తాను అనుకున్న ఫలితం రాలేదు. దీంతో ముఖ్యనేత మరొక అడుగు ముందుకు వేశారని, తనకు సన్నిహితంగా ఉండే ఓ పత్రిక ద్వారా సింగరేణిలో అక్రమాలు జరుగుతున్నాయని లీక్ చేయించారని ప్రచారం జరుగుతున్నది. నైని బొగ్గు గని టెండర్లలో నిబంధనలను మార్చి ఓ ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా కుట్ర జరిగిందని, ఉప ముఖ్యమంత్రి హస్తం ఉందని ఆ పత్రికలో వచ్చిన కథనాలను ముఖ్యనేత బృందం విస్తృతంగా ప్రచారం చేయించింది. ఈ వ్యవహారాన్ని వెంటనే ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పంపించింది. దీంతో భట్టి విక్రమార్క తనపై వచ్చిన ఆరోపణల గురించి అటు ముఖ్యనేతకు, ఇటు మీడియా ముఖంగా ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
సెకండ్ అంటే అంతే
రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత తానే అంతా అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బహిరంగంగా చెప్పుకొన్నారు. ఈ ప్రకటనల తర్వాత ముఖ్యనేత వేధింపుల వ్యూహంతో ఆయన కూడా తీవ్రంగా భంగపడాల్సి వచ్చిందన్న టాక్ ఉన్నది. అధికారంలోకి వచ్చిన మొదట్లో మంత్రిపై కొన్ని ఆరోపణలు రాగా ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో చేశారని, కాబట్టి సర్దుకోవాలని’ ముఖ్యనేత మొదట్లో భరోసా ఇచ్చారట. పైకి అంతా బాగుందని అనిపించినా, అన్ని విషయాలు బయటికి వస్తుండడంతో మంత్రి పొంగులేటి కంగుతినాల్సి వచ్చిందని చర్చ జరుగుతున్నది. భూ భారతి విధానంతో మంచి పేరు వస్తుందని మొదట్లో భావించిన ముఖ్యనేత ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి దీనికి సంబంధం లేనట్లుగా వ్యవహరించారు. ఆ తర్వాత భూ భారతితో జరుగుతున్న అక్రమాల బాధ్యత అంతా రెవెన్యూ మంత్రిదే అన్నట్లుగా చేశారు. హైదరాబాద్ సమీపంలోని భూముల క్రమబద్ధీకరణ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమై మరీ రెవెన్యూ మంత్రిపై ఆరోపణలు చేశారు. ముఖ్యనేత ఇచ్చిన సమాచారం ఆధారంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, రెవెన్యూ మంత్రిపై ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరిగింది.
ప్రభుత్వపరంగా ఆరోపణలు ఎలా ఉన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వ్యక్తిగతంగా వేధింపులకు గురైన వ్యవహారం అంతా ముఖ్యనేత కనుసన్నల్లోనే జరిగినట్లు ప్రచారం ఉన్నది. మంత్రి కుమారుడు హర్షారెడ్డి లగ్జరీ బ్రాండ్ వాచ్‌ల అక్రమ వ్యవహారంలో చిక్కుకున్నాడు. మొదట్లో ఈ వ్యవహారం బయటకు తెలియలేదు. ముఖ్యనేత సొంత మీడియాతోపాటు, సోషల్ మీడియా ద్వారా లీక్ చేయించారని, ముఖ్యనేత వ్యూహంలో భాగంగానే విస్తృత స్థాయిలో ప్రచారం జరిగిందని చెప్తున్నారు. హాంకాంగ్‌కు చెందిన వ్యాపారి ద్వారా సింగపూర్ నుంచి చెన్నైకి స్మగ్లింగ్ చేసిన రూ.35 కోట్ల విలువైన 7 వాచ్‌లను హర్షారెడ్డి అక్రమంగా కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ వాచ్‌ల కోసం హర్షరెడ్డి క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో చెల్లింపులు జరిపినట్లు నిర్ధారించారు. ఖరీదైన వాచ్‌లు, సొంత పార్టీ ఎమ్మెల్యేల ఆరోపణల తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సెకండ్ ప్లేస్ మాటల ప్రకటనలు ఆగిపోయాయి.
బీసీ మంత్రిపైనా
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సైతం ముఖ్యనేత వేధింపుల వ్యూహం నుంచి మినహాయింపు దక్కలేదని ప్రచారం జరుగుతున్నది. రవాణా శాఖలో కీలకమైన నిర్ణయాలను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తెలియకుండానే అకస్మాత్తుగా అమలు చేశారని అంటున్నారు. 14 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు సహా 15 చెక్ పోస్టులను ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ముఖ్యనేత ఉద్దేశపూర్వకంగానే మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆరోపణలు వచ్చేలా చేశారనే ప్రచారం ఉన్నది. అవినీతికి కేంద్రాలుగా మారిన చెక్ పోస్టులను మూసివేందుకు ముఖ్యనేత సుముఖంగా ఉన్నారని, మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డకుంటున్నారని సన్నిహిత మీడియాలో ప్రచారం చేయించారు. చెక్ పోస్టుల నుంచి ప్రతి నెలా ఆదాయం వస్తున్నందునే వీటి మూసివేత నిర్ణయాన్ని మంత్రి వాయిదా వేస్తున్నారని ఆరోపణలు చేయించారు. ఈ వ్యవహారంతో మంత్రి పొన్నం ప్రభాకర్ మానసికంగా ఇబ్బంది పడ్డారని అంటున్నారు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్‌లో ఉంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జాతీయ నాయకత్వంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవం ఉన్నది. కాబట్టి తనను కాదని ముందుకు పోకుండా కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే ముఖ్యనేత చెక్ పోస్టుల వ్యవహారాన్ని నడిపించినట్టు చెప్పుకొంటున్నారు.
ఏకంగా పీసీసీ చీఫ్నకూ వేధింపులు
జాతీయ పార్టీ ప్రభుత్వంలో ప్రధాన పీఠంపై కూర్చునేవారికి కొంత క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. అటు మంత్రులతో, ఇటు అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో ఎప్పటికప్పుడు సమన్వయం చేయాల్సి ఉంటుంది. అయితే ముఖ్యనేత తీరు మొదటి నుంచీ భిన్నంగా ఉన్నదని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. పాలనా పరంగా ఎక్కడైనా ప్రజల్లో అనుకూల స్పందన ఉంటే తానే చేసినట్లు చెప్పుకోవడం.. ఆరు గ్యారెంటీల అమల్లో వైఫల్యం, ఎన్నికల్లో నామమాత్రపు గెలుపు వంటి వ్యతిరేకతను మంత్రులు, పీసీసీ చీఫ్‌పై రుద్దుతున్నారనే చర్చ జరుగుతున్నది. వాస్తవానికి ముఖ్యనేత ఏరికోరి తన సన్నిహితుడిని పీసీసీ చీఫ్‌గా నియమించారని మొదటి నుంచీ ప్రచారంలో ఉన్నది. తర్వాత వారి మధ్య దూరం పెరిగిందని చెప్తున్నారు. బిగ్ బ్రదర్స్ భూదందాలు, ఖమ్మం జిల్లాలో పేదల ఇండ్లను కూల్చడం, హైడ్రా పేరుతో పేదలను వేధించడం, అధికార పార్టీ నాయకులకు పదవుల పంపకంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై మహేశ్‌కుమార్‌గౌడ్ నివేదికలు తయారు చేసి జాతీయ నాయకత్వానికి ఎప్పటికప్పుడు అందించారని అంటున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలను నెరవేర్చినందుకు ముఖ్యనేత టార్గెట్ చేసి మరీ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా సంబంధంలేని విషయాల్లో పీసీసీ చీఫ్‌ను బదనాం చేసేలా ముఖ్యనేత సన్నిహిత మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఎప్పుడో జరిగిన వాటికి ఇప్పుడు లింకు పెట్టి చేస్తున్న దుష్ప్రచారంతో పీసీసీ చీఫ్ మానసికంగా ఇబ్బంది పడ్డారని అంటున్నారు. ముఖ్యనేత వేధింపుల పర్వం పరాకాష్టకు చేరడంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇలా రాష్ట్రంలో తమ, పర బేధం లేకుండా ప్రతి ఒక్కరిపైనా బెదిరింపుల రాజకీయం నడుస్తున్నదని కాంగ్రెస్ శ్రేణులే చెప్తున్నారు. అభయ హస్తం కాస్తా.. భస్మాసుర హస్తంగా మారిందని, తమపైనే ప్రతాపం చూపుతున్నదని మంత్రులు, నేతలు వాపోతున్నారట.
మహిళా మంత్రిపైనా..

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లోనే ఉంటూ బీసీ మహిళాకోటాలో మంత్రి పదవి చేపట్టిన కొండా సురేఖ సైతం ముఖ్యనేత వేధింపుల రాజకీయం నుంచి తప్పించుకోలేకపోయారని చెప్తున్నారు. ముఖ్యనేత సన్నిహితులు జోక్యం చేసుకున్న ఓ వ్యవహారాన్ని మంత్రి కొండా సురేఖ అడ్డుకుంటున్నారనే కారణంతో ఆమెపై తీవ్ర స్థాయిలో వేధింపుల రాజకీయ వ్యూహం అమలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మంత్రి సురేఖ ఓఎస్డీగా పని చేసే వ్యక్తి డబ్బుల కోసం దకన్ సిమెంట్ ప్రతినిధులను తుపాకీతో బెదిరించారని, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీనిపై ఫిర్యాదు చేశారనే వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏకంగా మంత్రి కొండా సురేఖ ఇంట్లోకి పోలీసులు రాత్రిపూట వెళ్లి సోదాల పేరుతో వారి కుటుంబ సభ్యులను వేధించిన పరిస్థితి నెలకొన్నది.
మంత్రి కుమార్తె మీడియా ముందుకు వచ్చి ఏకంగా ముఖ్యనేతపైనే ఆరోపణలు చేశారు. పోలీసులు ఇలా చేయడంపై పలువురు ఇతర మంత్రులు ఖండించినా, మంత్రి సురేఖ ప్రతిష్టను దిగజార్చేలా ముఖ్యనేత బృందం ప్రచారం చేయించింది. మంత్రి సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలను ప్రధాన అంశంగా మార్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించింది. అప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలతో విభేదాలు, పలు ఇతర అంశాల్లో వివాదాస్పదంగా ఉన్న కొండా సురేఖ ఈ వ్యవహారంతో పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారు. మంత్రి కొండా సురేఖ స్వయంగా వెళ్లి ముఖ్యనేతకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యనేత వేధింపుల వ్యూహం మొదటిసారి ఫలితం ఇచ్చిందని అంటున్నారు.సొంత జిల్లా మంత్రిపై..
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి సామాజిక సమీకరణలో మంత్రి పదవి దక్కించుకున్న జూపల్లి కృష్ణారావుపైనా ముఖ్యనేత సొంత వ్యూహాన్ని అమలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యనేత బృందానికి పోటీగా మంత్రి జూపల్లి రాజకీయంగా ఎలాంటి క్రియాశీలపాత్ర పోషించకుండా ఉండేందుకు ఇలా చేశారనే అభిప్రాయం ఉన్నది. లిక్కర్ కొత్త బ్రాండ్ల వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దల నిర్ణయాలతో తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తన శాఖలో తనకు సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని, బదనాం మొత్తం తానే మోయాల్సి వచ్చిందని మంత్రి వాపోయారు. మద్యం కొత్త బ్రాండ్లకు అనుమతుల వ్యవహారంపై మంత్రి స్వయంగా విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చింది.
చివరికి ముఖ్యనేత ఆదేశాలతో ఈ విచారణ అటకెక్కిందని అంటున్నారు. ప్రభుత్వం ఓ మద్యం డిస్టిలరీకి అనుమతి ఇచ్చిన విషయం ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రచురించింది. అనుమతులేవీ ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ప్రకటించారు. కొన్ని రోజులకే ఆ డిస్టిలరీతోపాటు మరో ఐదు కంపెనీలకు అనుమతులిచ్చినట్లు అధికారికంగా వెల్లడైంది. ఎక్సైజ్ ఉన్నతాధికారులను ఆరా తీయగా ఉన్నత స్థాయి ఆదేశాలతో అనుమతులు వచ్చాయని చెప్పారు. ముఖ్యనేత కార్యాలయం ఆదేశాలతో ఇదంతా పూర్తయినట్లు మంత్రి జూపల్లి నిర్ధారించుకున్నారు. హైదరాబాద్‌లో మరో రెండు బార్లకు అనుమతుల విషయంలోనూ ఇదే జరిగింది. అనుమతుల విషయంలో మంత్రికి, కంపెనీలకు మధ్య ఏదో జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీని వెనుక ఉన్న వారు పెద్ద స్థాయి వారు కావడంతో అప్పటి నుంచి మంత్రి జూపల్లి సొంత శాఖలోనూ తన పరిధి మేరకు ఉండాల్సి వస్తున్నది.