రామారెడ్డి (సదాశివనగర్), నవంబర్ 15: సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసిన కాంగ్రెస్ నాయకుడికి ఊహించని రీతిలో షాక్ తగిలింది. చికిత్స కోసం రూ.32 లక్షలు ఖర్చయ్యాయని సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేస్తే రూ.60 వేలు మంజూరు చేయడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
రిలీఫ్ ఫండ్ చెక్కు చించి పడేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్లూర్ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేత, సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్ సోదరి నేహాబేగం 2024లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెకు నెలల తరబడి చికిత్స చేయించారు. బాకీ తెచ్చి రూ.32 లక్షలు వైద్యం కోసం ఖర్చు చేసినా ఆమె చనిపోయింది. సీఎంఆర్ఎఫ్ కోసం ఇర్షాదుద్దీన్ దరఖాస్తు చేశాడు. ప్రభుత్వం నుంచి రూ.60 వేలు మంజూరు చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన చెక్కు చించేశారు.