హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బీహార్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆదివారం బీహార్‌లోని కిషన్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తున్న షబ్బీర్‌అలీ మాట్లాడుతూ బీజేపీకి బీటీంగా పనిచేస్తున్న ఎంఐఎంకి ఓటు వేయొద్దని కోరారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయని, కాంగ్రెస్ ఒక్కటే సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. ఎంఐఎంకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, ఆ రెండు పార్టీలు వేర్వేరు కాదని చెప్పారు. ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ఎంఐఎం పనిచేస్తున్నదని, దీనివల్ల అంతిమంగా బీజేపీకే ఉపయోగమని పేర్కొన్నారు. ఈ తరహా రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఎంఐఎం, బీజేపీలను ఓడించాలని కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఎంఐఎంతో బీజేపీ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నదని ఆరోపించారు. అందుకనే కాంగ్రెస్ గెలిచే ప్రాంతాల్లో ఎంఐఎం తమ అభ్యర్థులను నిలబెట్టిందని వివరించారు.
భగ్గుమంటున్న ఎంఐఎం
బీహార్‌లో షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం భగ్గుమంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని పరిణామాలు, బీహార్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్, ఎంఐఎం మధ్య దూరం పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ఎంఐఎం తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తొలుత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన అవసరం లేదని ఎంఐఎం తన క్యాడర్‌కు చెప్పినట్టు తెలిసింది. అసదుద్దీన్ కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పూటకో మాట మాట్లాడుతున్నదని, ఆ పార్టీ నమ్మదగినది కాదని చెప్పినట్టు సమాచారం. దీంతో ఎంఐఎం కార్యకర్తలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్సే: ఎంఐఎం
బీహార్ ఎన్నికల ప్రచారంలో షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించినప్పటికీ ఆ పార్టీ నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఇదే విషయాన్ని వారు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై అసహనంతో ఉన్న ఎంఐఎం నాయకులు షబ్బీర్ అలీ వ్యాఖ్యలను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. బీహార్‌లో ఈసారి మంచి సీట్లు సాధించి అక్కడి రాజకీయాల్ల్లో క్రియాశీలపాత్ర పోషించాలనుకుంటున్న తమపై తెలంగాణలో స్నేహితులమని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా మాట్లాడటం ఏమిటని ఎంఐఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క షబ్బీర్‌అలీ మాత్రమే కాదని, పలువురు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కూడా ఎంఐఎం పట్ల అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. అజారుద్దీన్ విషయంలోనూ తమను నమ్మించి మోసం చేశారని మండిపడినట్టు సమాచారం.