హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : దేశంలోని 30 కోట్ల మంది మైనార్టీలపై కాంగ్రెస్ కపట ప్రేమను చూపుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్లో జరిగిన చర్చలో పాల్గొనకుండా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వెన్నుచూపి పారిపోవడం, ప్రియాంకగాంధీ డుమ్మాకొట్టడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం కవిత మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మైనార్టీల హక్కులను కాలరాసేలా తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుపై రాహుల్ మాట్లాడకపోవడం, అత్యధికంగా మైనార్టీ ఓటర్లున్న నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రియాంక హాజరుకాకపోవడం దారుణమని అన్నారు. ‘కాంగ్రెస్ నేతలకు ఎన్నికల టైంలోనే మైనార్టీలు గుర్తుకువస్తారు.. టోపీలు పెట్టుకొని ఓట్లడిగి గద్దెనెక్కిన తర్వాత నిండా ముంచుతారు..’ అని నిప్పులు చెరిగారు. మైనార్టీల హక్కులను కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనని ప్రగల్భాలు పలికే ఇద్దరు గాంధీలు వక్ఫ్ బిల్లుపై జరిగిన చర్చకు ఎందుకు డుమ్మాకొట్టారో దేశప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ది మొదటి నుంచి ఒకే విధానమని కవిత స్పష్టం చేశారు. అందుకే పార్లమెంట్లో వారి తరఫున అనేకసార్లు గొంతెత్తామని గుర్తుచేశారు. గాంధీల మాదిరిగా తామెన్నడూ మైనార్టీలకు ద్రోహం చేయలేదని చెప్పారు.
ఈ నెల 8న తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద కవిత చేపట్టనున్న ఫూలే సాధన దీక్ష పోస్టర్‌ను కవిత ఆవిష్కరించారు. పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారపోసిన మహాత్మా జ్యోతిరావుఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతున్నదో అర్థంకావడం లేదని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ఫూలే విగ్రహ సాధన దీక్షకు బీసీ బిడ్డలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వలిగొండ: కాంగ్రెస్ వైఫల్యంతోనే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని కవిత విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఏదుళ్లగూడెం గ్రామానికి చెందిన విశ్రాంత ఎస్ఈ గూడూరు మోహన్‌రెడ్డి సంతాప సభలో శనివారం ఆమె పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లుపై విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లు సందర్భంగా పార్లమెంట్లో రాహుల్‌గాంధీ నోరు మెదపలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఈఈలు శ్యాంసుందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్తిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మ వెంకట్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.