Congress | నవాబ్‌పేట, మార్చి19 : మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకే న్యాయం జరగడం లేదంటూ.. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండల కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు బంక మల్లేశ్‌యాదవ్ బుధవారం నిరసన చేపట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు 42శాతం బీసీ రిజర్వేషన్లను హర్షిస్తూ.. అంబేద్కర్ చౌరస్తాలో సీఎం, ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకుడు మల్లేశ్‌యాదవ్ అంబేద్కర్ విగ్రహం ముందు నేలపై కూర్చొని నిరసన చేపట్టారు. ఈ విషయంపై నాయకులంతా ఆరా తీయగా మల్లేశ్‌యాదవ్ తన సమస్యను వివరించారు.
నవాబ్‌పేట శివారులో ప్రధాన రోడ్డు పక్కనే తనకు 8 గుంటల పొలం ఉన్నదని, దానిని వేరే వ్యక్తి కబ్జా చేశాడని తెలిపారు. సివిల్ తగాదాల్లో పోలీసులు తలదూర్చారని ఆరోపించారు. తనకు న్యాయం చేయమని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆశ్రయిస్తే.. కబ్జా చేసిన వ్యక్తికే మద్దతు తెలుపుతున్నారని వాపోయారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై విక్రమ్‌ను వివరణ కోరగా.. మల్లేశ్ ఆరోపిస్తున్న భూమిపై శ్రీరాములు అనే వ్యక్తికి అన్ని హక్కులు ఉన్నాయని, ఆన్లైన్లో భూమి ఉందని, ముడా అనుమతి కూడా ఉందని, చట్ట ప్రకారమే తాము పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు.