సిరిసిల్ల రూరల్, జూలై 12: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తొలి సీఎం కేసీఆర్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో 26 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు.
త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పేరిట పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటోలేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులు మళ్లీ ప్రొటోకాల్‌ను ఉల్లఘించారు. ఎలాంటి పదవి లేకపోయినా స్థానిక కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను పక్కనే కూర్చొబెట్టుకుని అధికారిక కార్యక్రమం నిర్వహించారు.
లబ్ధిదారుల జాబితాలోంచి తమ పేర్లు తొలగించారంటూ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లెల్లకు చెందిన దుబ్బాక మల్లవ్వ, కడమంచి రాజు, అనూష, ఎండీ మదీన, పాశం సంధ్య, బర్ల లక్ష్మితోపాటు పలువురు ఆందోళన చేపట్టారు. తమ కుమారుడికి ఆపరేషన్ ఉందని దవాఖానకు వెళ్లగా ఇంట్లో ఎవరూలేరనే కారణంతో జాబితాలోంచి తమ పేరు తొలగించారని కడమంచి రాజు-అనూష దంపతులు కొడుకుతో వచ్చి గోడు వెల్లబోసుకోగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల పహారాలో లబ్ధిదారులకు ఇండ్ల మంజూరుపత్రాలు అందజేశారు.