Madhu Yashki | హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ‘పోలీస్ ఉన్నతాధికారి ఒకరు శాంతిభద్రతల పరిరక్షణ వదిలి ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడు. మరొక కీలక అధికారి భూ వివాదాలు, వ్యక్తిగత ప్రచారం కోసం పాకులాడుతున్నాడు’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. వారి పేరు బయటికి చెప్పకుండానే వారెవరో తెలిసి పోయేంత సరళంగా వారిపై తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. సొంత వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని పరోక్షంగా ఇద్దరు కీలక ఐపీఎస్ అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్ గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొందరు పోలీస్ అధికారుల వల్ల ప్రజాప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ఒక కీలక పోలీస్ కమిషనర్ శాంతిభద్రతలను పర్యవేక్షించడం మానేసి, కేవలం భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని విమర్శించారు. మరికొందరు అధికారులు నిజాయితీగా పనిచేయడమేమో కానీ, ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా అర్ధరాత్రి వేళలో ఇన్వెస్టిగేషన్ చేయమని, అరెస్టులు చేయాలని ఆదేశించరని, కానీ ఒక పోలీస్ అధికారి అత్యుత్సాహానికి పోయి ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చారని మధుయాష్కీ మండిపడ్డారు.
ప్రజాప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోవాలని, పబ్లిసిటీ కోసం అధికారులు పనిచేయవద్దని హితవు పలికారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే కొందరు పోలీస్ అధికారులు డ్రగ్స్ పెడ్లర్లకు ఫ్రెండ్లీగా వ్యవహరించారనే తీవ్ర ఆరోపణ చేశారు. హెడ్‌లైన్స్‌లో రావడానికి ఉన్న అధికారిన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అర్ధ్దరాత్రి అరెస్టులతో వార్తల్లో హైలెట్ కావాలని చూస్తున్నారని విమర్శించారు. ఎవరిని అరెస్టు చేసినా ప్రొసీజర్ ప్రకారమే చేయాలని సూచించారు. కానీ ఓ కమిషనర్ అమాయకులపై ప్రతాపం చూపుతున్నారని ఆరోపించారు. ఏ కేసు అయినా, ఏ విచారణ అయినా, సీఎం రేవంత్‌రెడ్డి చట్టప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లాలని చెప్తున్నారని, కానీ కొందరు అధికారులు ఇన్వెస్టిగేషన్ అంటే అర్ధరాత్రి అరెస్ట్ చేస్తూ, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారులు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే మంచిదని హితవు పలికారు.
పార్టీ కోసమే కష్టపడుతున్న జీవన్‌రెడ్డి
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని ఈ సందర్భంగా మధుయాష్కీ గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఆయన అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. ఆయన పార్టీ మారాలనుకుంటే కేసీఆర్ హయాంలోనే మారేవారని, ఇప్పుడు పార్టీ మారుతారని అనుకోవడం అవివేకమేనని చెప్పారు. ఒక దశలో పార్టీ అధిష్ఠానం జీవన్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా కూడా నియమించాలని భావించిందని వెల్లడించారు. సీనియర్లకు పదవులు ఉన్నా, లేకపోయినా పార్టీ కోసమే పనిచేస్తారన్నారని చెప్పారు.
ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నాయకులను కలుపుకొనిపోయేలా పార్టీని సమన్వయం చేయాల్సిన బాధ్యత చాన్చార్జి మంత్రులపైనే ఉన్నదని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పార్టీని సమన్వయం చేయడానికి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే కుదరదని, వారు పాత కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు ఉత్తరకుమార ప్రగల్భాలు చేయడం మానేసి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని సూచించారు.