కల్వకుర్తి: రైతు భరోసా ఎప్పుడు వెస్తారంటూ ప్రశ్చించిన రైతులను కొట్టడానికి యత్నించాడో కాంగ్రెస్ నేత (Congress Leader). నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌కు వివిధ గ్రామాల రైతులు పల్లీలను అమ్మేందుకు తీసుకువచ్చారు. అయితే వ్యాపారులు సరైన ధరను టెండర్ చేయకపోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ చౌరస్తాకు చేరుకొని ధర్నా నిర్వహించారు. దీంతో రాష్ట్ర వ్యవసాయ కమిటీ సభ్యుడు, వంగూరు మండల మాజీ జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి (KVN Reddy) సహా వ్యవసాయ మార్కెట్ కమిటీ నేతలు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇతర మార్కెట్ యార్డుల్లో పల్లీకి మద్దతు ధర దాదాపుగా రూ.7,500 ఉండగా కల్వకుర్తిలో మాత్రం రూ.5,400 ఎలా చెల్లిస్తున్నారని రైతులు వారిని ప్రశ్నించారు. వ్యాపారులు తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు తమకు న్యాయం చేయాలని, లేదంటే రీ టెండరింగ్ వేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఏమైందని, ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
వారికి నచ్చజెప్పేందుకు కేవీఎన్ రెడ్డి యత్నించగా.. ‘ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, సీఎం డౌన్‌డౌన్.. వద్దురా వద్దురా కాంగ్రెస్ పాలన వద్దురా’ అంటూ రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆయనతో వాదనకు దిగారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేవీఎన్ రెడ్డి.. నినాదాలు చేస్తున్న ఓ రైతును కొట్టేందుకు యత్నించారు.
ఈ క్రమంలో రైతులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కొడతారా అంటూ నిలదీశారు. ఎంతమందిని కొడతారంటూ ప్రశ్నించారు. రైతులంతా అతనిపై ఎగబడటంతో.. జోక్యం చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్కడి నుంచి పంపించారు. వెల్దండ సీఐ, కల్వకుర్తి పోలీసులు, వ్యవసాయ మార్కెట్ పాలక మండలి సభ్యులు రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.