Azam Jahi Mills | వరంగల్, డిసెంబరు 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికార పార్టీ నేతల అండదండలతో వరంగల్ నగరంలోని 75 ఏండ్ల నిషాన్ కనుమరుగైంది. ఆజంజాహి మిల్లు కార్మిక సంఘం భవనం నేలమట్టమైంది. మి ల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచిన భవనం కబ్జాదారుల కన్నుల్లో పడి కానరాకుండా పోయింది. కబ్జా కోసం కొన్నేండ్లుగా ఓ వ్యాపారి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్న కార్మిక సంఘాలు ఇప్పుడు అధికార పార్టీ బలాన్ని ఎదుర్కొనలేకపోయాయి. మూడేండ్ల క్రితం కార్మిక భవనం కార్మికుల కోసమే అని ప్రకటించిన అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు మాట మార్చి ఆ స్థలంలో ప్రైవేటు వ్యాపారి కాంప్లెక్స్ నిర్మాణానికి దగ్గరుండి పునాది రాయి వేయించి నిర్మాణ పనులు ప్రారంభించారు.
నాలుగేండ్ల క్రితం అజంజాహి మిల్లు కార్మిక సంఘం భవనం కబ్జా కాకుండా కాపాడతానని అప్పటి ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు అదే పనికి మద్దతు తెలపడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక భవనం కబ్జా కాకుండా చూస్తానని ఇప్పటి అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ అభయమిచ్చారు. భవనం కూల్చి కాంప్లెక్సు కట్టేందుకు ప్రయత్నించిన వ్యాపారికి హెచ్చరికలు జారీ చేశారు. ఆ నాయకుడే ఇప్పుడు కాంప్లెక్స్ నిర్మాణానికి పునాది రాయి వేశారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాతోపాటు వేల మందికి ఉపాధి కల్పించిన అజంజాహి మిల్లు కార్మికుల కోసం ఏడున్నర దశాబ్దాల క్రితం కార్మిక సంఘం భవనాన్ని కట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాల నిర్వాకంతో అజంజాహి మిల్లు మూత పడి కార్మికుల ఉపాధి పోయింది. సమైక్య రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో అజంజాహి మిల్లు స్థలంలో ఓ ప్రైవేటు సంస్థ విల్లాలు నిర్మించింది. కార్మికుల క్వార్టర్స్ భూమిని ‘ఓ సిటీ’ పేరుతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)అమ్ముకున్నది. వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన అజంజాహి మిల్లు ఆనవాళ్లలో కార్మిక సంఘం భవనం ఒక్కటే మిగిలింది. ఇప్పుడు దానిని కూడా నేలమట్టం చేయడంతో అజంజాహి ఆనవాళ్లు లేకుండా పోయాయి.
అధికార పార్టీ నేతలే అజాంజాహి మిల్లు కార్మిక భవనం భూమి కబ్జాకు తెరలేపారనే ఆరోపణలున్నాయి. కార్మిక భవనం స్థలం తనదంటూ కాగితాలు పట్టుకుని తిరుగుతున్న ఓ వ్యాపారి ఎవరో ఎవరికి తెలియదని కార్మిక సంఘం నాయకులు చెప్తున్నారు. అధికార పార్టీ నేతలు అండగా ఉంటున్న ఆ వ్యాపారికి ఈ స్థలం ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఈ విషయం పెండింగ్‌లో ఉన్నప్పుడు కార్మిక సంఘం భవనం ఎలా నేలమట్టం చేస్తారని నిలదీస్తున్నారు. కార్మికుల సమస్యలు చర్చించుకునేందుకు 75 ఏండ్ల క్రితం అజంజాహి మిల్లు యాజమాన్యం యూనియన్ భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతికి ఎలా వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. వరంగల్‌లో కోట్ల విలువైన 1450 గజాల భూమిని అధికార పార్టీ నేతల అండదండలతో ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.