జగిత్యాల, జనవరి 4, (నమస్తే తెలంగాణ): పదేండ్లు జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇవ్వాలి, అలా కాకుండా ఎవరైనా అడ్డుపడితే వారిని నరికి పారేస్తం. ప్రజాజీవితంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ కార్యకర్తల హకుల కోసం పోరాటం చేస్తాను. శ్రీరాముడు ధర్మానికి కట్టుబడి వనవాసం పోయాడు. ధర్మానికి అడ్డం పడితే రావణాసురుడి పది తలలు నరికాడు. ఇక్కడ ధర్మానికి అడ్డంపడే ఒక్క తలకాయను నరకలేనా?
ఇవీ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నేత టీ జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని ఇందిరా భవన్లో కార్యకర్తల సమావేశంలో ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కొంతకాలంగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దోచుకోవడం, జేబులు నింపుకోవడం కోసమే కొందరు కాంగ్రెస్‌లోకి వచ్చి, అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలే రథసారథులని, వారిని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జగిత్యాల మున్సిపాలిటీని గౌరీశంకర్ అనే కాంట్రాక్ట్ కంపెనీకి కుదువపెట్టినట్టుగా కనిపిస్తున్నదని,ఆ కంపెనీ వాళ్లు చెప్తే అధికారులను బదిలీ చేయడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ జెండా పట్టనివారు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే అంటే మున్సిపాలిటీకి సలహాదారుడు మాత్రమేనని, అంతేగాని నాయకుడు కాదన్న విషయం గ్రహించాలని హితవు పలికారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులు కాంగ్రెస్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అమ్ముడు పోయేందుకు కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకుకాదని తేల్చిచెప్పారు. జేబులు నింపుకోవాలని వస్తున్న వాళ్లతో జాగ్రత్త అని కార్యకర్తలకు
సూచించారు.