జగిత్యాల రూరల్, నవంబర్ 5: వరి కోతలు మొదలై చాలా రోజులవుతున్నదని, ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారని జగిత్యాల మండల కాంగ్రెస్ నాయకుడు గుంటి మొగిలి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రశ్నించారు. మంగళవారం నేరుగా గాంధీభవన్‌కు ఫోన్ చేసి.. రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా కొనడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఫోన్‌కాల్ రిసీవ్ చేసుకున్న గాంధీభవన్ వర్గాలు.. ఫిర్యాదు చేసిన ప్రతి అంశాన్నీ పీసీసీ అధ్యక్షుడికి వివరిస్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూస్తామని చెప్పాయని వివరించారు. 30 ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నామని, ఎన్నికల్లో తాము పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఓట్లు అడిగామని చెప్పారు. ఇప్పుడు రైతుల సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తాను గాంధీభవన్‌కు ఫోన్ చేసి ఈ విషయాలను మాట్లాడానని గుంటి మొగిలి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.