తాడూరు, సెప్టెంబర్ 22 : ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఓ కాంగ్రెస్ నాయకుడు రూ.25 వేలు డిమాండ్ చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం సిర్సవాడకు చెందిన నిరుపేద ఏదుల భీమమ్మ పాత రేకుల ఇంటిలో నివాసం ఉంటున్నది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆ తర్వాత ఇల్లు మంజూరైందని కాంగ్రెస్ నాయకుడు మల్లేశ్ ఆమెకు ఫోన్ చేసి చెప్పడంతోపాటు 25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
డబ్బులు అడుగుతుండటంతో 10 వేలు మల్లేశ్‌కు ఇచ్చింది. తర్వాత ఇల్లు బేస్మెంట్ వరకు నిర్మాణం జరిగింది. ఈ స్థల విషయమై భీమమ్మ, ఆమె బావకు గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత ఆమె బావతో కలిసి మిగతా 15 వేలు ఇవ్వాలని, లేకుంటే పనులను అడ్డుకుంటామని బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది.