Congress | హైదరాబాద్, జులై 14(నమస్తే తెలంగాణ): ‘ఒళ్లు బలిసి దీక్షలు చేస్తున్నరు. తిన్నది అరగక చేస్తున్నరు. వీళ్లకు పనీపాటా లేదు. నిరుద్యోగుల ముసుగులో దొంగ దీక్షలు చేస్తున్నరు. అసలు నిరుద్యోగి అనేటోడు ఇట్లా రోడ్లపైకొచ్చి ధర్నాలు చేస్తడా.’ అని నిరుద్యోగ యువతపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఓయూ నేత చనగాని దయాకర్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలివి! ఆదివారం ఓ చానల్ డిబేట్లో ఆయన నిరుద్యోగులను కించపరిచేలా మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి బాటలోనే పలువురు కాంగ్రెస్ నేతలు తమను ఇలా హేళన చేస్తూ మాట్లాడడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే అడుగుతున్నామని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషిచేసిన తమను నయవంచనకు గురిచేసిందని మండిపడుతున్నారు. రెండుమూడు రోజుల క్రితం తలకుమాసినోళ్లే దీక్షలు చేస్తున్నరని మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి శనివారం జేఎన్టీయూ వేదికగా మరోసారి నిరుద్యోగులపై అక్కసు వెళ్లగక్కారు.
పరీక్షలు రాయనోళ్లు, ఉద్యోగాల కోసం పోటీలో లేనోళ్లు దీక్షలు చేస్తున్నారని హేళన చేశారు. ఆయన బాటలోనే దయాకర్ సైతం అహంకారపూరిత మాటలు మాట్లాడారు. ‘ధర్నాలు చేస్తున్నవాళ్లు నిరుద్యోగులే కాదు. వాళ్లంతా రాజకీయ ముసుగు వేసుకున్నారు. దొంగ నిరుద్యోగులను తయారు చేసి ధర్నాలు చేయిస్తున్నారు. ఓయూలో నిరుద్యోగులే లేరు. అసలు నిరుద్యోగి బయటకు వస్తడా.. ధర్నాలు చేస్తడా’ అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు.
నాడు నానా యాగీ.. నేడు వాళ్లంతా ఏరీ?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులు నానా యాగీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో ప్రస్తుత ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, బల్మూరి వెంకట్, నేతలు మానవతారాయ్, శివసేనారెడ్డి, రియాజ్, హర్షవర్ధన్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. నాడు వీళ్లంతా నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి రోడ్డెక్కెలా చేశారనే విమర్శలున్నాయి.
అధికారం కోసం నిరుద్యోగులను వాడుకున్న కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారికి ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దీంతో కడుపుమండిన నిరుద్యోగులు కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని దునుమాడుతూ కదం తొక్కుతున్నారు. నాడు తమను అడ్డం పెట్టుకొని నానా యాగీ చేసిన వాళ్లంతా ఇప్పుడు ఎక్కడికి పోయారని నిలదీస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అంటున్నట్టుగా నాడు వాళ్లు కూడా దొంగ దీక్షలు చేశారా? అని ప్రశ్నిస్తున్నారు.