హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ‘రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశా రు’ అని కాంగ్రెస్ మాజీ నేత, సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ ఆరోపించారు. బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయిస్తామని పొంగులేటితో ఫోన్లో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులైన టీజీవో, టీఎన్జీవో నాయకులు చెప్పడం అధికార దుర్వినియోగమేనని ఆరోపించారు. తక్షణమే మంత్రితోపాటు బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పూర్తి ఆధారాలు సహా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి ఫిర్యాదు చేశారు.
అనంతరం ఎస్ఈసీ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మీడియా తో మాట్లాడారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావుతోపాటు రమేశ్, శోభన్‌బాబు, వేలాద్రి, ఇతర సభ్యులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఎస్ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కొందరు గెజిటెడ్ అధికారులు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని, ఇది తెలంగాణ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ 1964, ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధమని వివరించారు. ఎన్నికల కమిషన్ తక్షణమే విచారణ చేపట్టాలని, ఆధారాలను పరిశీలించి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా? రేవంత్‌రెడ్డినా అని రాష్ట్ర పోలీసులను కాంగ్రెస్ మాజీ నేత, సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు లక్ష్యంగా ఎక్స్ వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన అకౌంట్ల వివరాలను కోరుతూ హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రిపైనైనా ద్వేషపూరిత పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పాల్సిన పోలీసులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుగా పేర్కొంటూ ఎక్స్ సంస్థకు నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, రేవంత్‌రెడ్డి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును ఏమైనా అంటే కేసులు పెడుతామని తెలంగాణ పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వాలి? అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులకు ఏపీ ప్రభుత్వం జీతాలు ఇస్తుందా? చంద్రబాబు ఇస్తున్నారా? తెలంగాణ ప్రజలు ఇస్తున్నారా? అని నిలదీశారు. తెలంగాణపై చంద్రబాబు అధికారం నడుస్తుంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అని మండిపడ్డారు.