మహబూబ్‌నగర్, జూలై 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పాలమూరు: పాలమూరులో కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతున్నారు. అధికార పార్టీ నేత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్ బుధవారం తన అనుచరులతో కార్యాలయానికి వెళ్లి మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్‌పై దాడికి దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనమైంది. ఈ దాడితో భయభ్రాంతులకు గురైన సిబ్బంది కార్యాలయానికి తాళం వేసుకొని బిక్కుబిక్కుమని గడిపారు. మార్కెట్లోని లైసెన్స్డ్ కూలీలకు ప్రతి ఏడాది యూనిఫాంలు పంపిణీ చేస్తారు. అయితే, లైసెన్స్ లేకున్నా తాను చెప్పిన వారికి యూనిఫాంలు ఇవ్వాలని కార్యదర్శిపై విజయ్‌కుమార్ ఒత్తిడి తెచ్చారు.
అయితే, అలా చేయడం రూల్స్‌కు విరుద్ధమని, ఈ విషయాన్ని మార్కెట్ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్తానని భాస్కర్ చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అధికార పార్టీ నేత కార్యదర్శి కాలర్ పట్టుకుని సిబ్బంది ముందే పిడిగుద్దులు కురిపించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తనపై జరిగిన దాడిపై భాస్కర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన రెండు గంటల తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. అనంతరం భాస్కర్‌ను దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు.
కార్యాలయంలో తాగి తందనాలు
మార్కెట్ కార్యాలయంలో కాంగ్రెస్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని సిబ్బంది ఆరోపిస్తున్నారు. వైస్ చైర్మన్‌తోపాటు పలువురు నాయకులు ఇక్కడే తాగి, తిని వెళ్తుంటారని, పంచాయితీలు, సెటిల్మెంట్లు చేస్తుంటారని వాపోయారు. మరోవైపు, తమపై వేధింపులు ఎక్కువయ్యాయని కమీషన్ ఏజెంట్లు సైతం ఆరోపిస్తున్నారు. కాగా, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్‌పై కేసు నమోదైనట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.