వంగూరు, జూన్ 10: గ్రామంలోని సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకొచ్చిన బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ నాయకుడు, సర్పంచ్ భర్త దౌర్జన్యానికి పాల్పడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం చౌదర్పల్లిలో బుధవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. చౌదర్పల్లిలో సర్పంచ్ గోపాల చూడామణి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు.
దీంతో గ్రామంలో మద్యంపానం,గుట్కా విక్రయాలు నిలిపివేయాలని బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి స్థానికులు చేసిన తీర్మాన పత్రాన్ని అందజేశాడు. అనంతరం మరిన్ని సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లగా.. అతడిపై అధికారుల ఎదుటే సర్పంచ్ భర్త, అధికార పార్టీకి చెందిన నరేందర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. పరుష పదజాలంలో మాటల యుద్ధానికి దిగారు. అక్కడే ఉన్న కుర్చీ లేపి ప్రవీణ్పైకి విసిరేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకోగా.. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని నరేందర్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించి వేయడంతో సమస్య సద్దుమణిగింది.