Anjankumar Yadav | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): రాహుల్‌గాంధీ చెప్పారు కాబట్టే కులగణన జరిగిందని, లేకుంటే రెడ్డి వర్గీయులు సర్వే ఎప్పుడు కానిస్తుండే అని మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌యాదవ్ సం చలన వ్యాఖ్యలు చేశారు. కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెట్టి తెలంగాణను ఇయ్యనీయకుండా కన్న మ్మ బాధలు పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వారే కులగణన సర్వే జరగకుండా అడ్డంపడ్డారని మండిపడ్డారు. సోనియాగాంధీ గట్టిగా పట్టుబట్టినందున తెలంగాణ వచ్చిందని, రాహుల్‌గాంధీ గట్టి నిర్ణయం తీసుకున్నందున కులగణన జరిగిందని చెప్పారు.
సోమవారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన అంజన్‌కుమార్‌యాదవ్.. కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తనకు ఏ భజనపరులూ వరింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వలేదని, లాలూప్రసాద్‌యాదవ్ చొరవ తీసుకొని సోనియాగాంధీకి చెప్పి తనకు పదవి ఇప్పించారని వెల్లడించారు. తనకు కేంద్ర మంత్రి పదవి రాకుండా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు రెండు సార్లు అడ్డంపడ్డారని ఆరోపించారు. తనకు వరింగ్ ప్రెసిడెంట్ ఇవ్వొద్దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి అడ్డుతగిలారని మండిపడ్డారు.
ఇంకా చాలా ఇయ్యాలె
గెలిచే సమయంలో తనకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా, ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చి దానం నాగేందర్‌కు ఇచ్చినందుకే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని అంజన్‌కుమార్ విమర్శించారు. వీ హన్మంతరావు జీవితంలో ఒకేఒక్కసారి మాత్రమే గెలిచారని, అది కూడా యాదవ నేతలు అండగా నిలబడి ఓటు వేస్తేనే గెలిచారని చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా రెడ్లు ఎంపీగా పోటీ చేస్తారని, కానీ మనకు మాత్రం టికెట్లు ఇవ్వరంటూ మండిపడ్డారు. తన కుమారుడు అనిల్‌కు రాజ్యసభ టికెట్ ఇవ్వడాన్ని కొందరు ఓర్చుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. యాదవులకు రాజ్యసభ ఒక్కటే కాదని, ఇంకా చాలా కావాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, కౌన్సిలర్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.