Telangana Politics | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో ప్రత్యర్థుల లోపాలను గుర్తించడం, వారు చేసిన అవినీతి, అక్రమాలను వెలికితీయడం ద్వారా కట్టడి చేయడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సరైన వేదికలు ఎంచుకోవడం, అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రధాన అస్త్రాలుగా ఉండేవి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూత్రాలను సమూలంగా మార్చివేసింది. మొదట్లో రాజకీయ ప్రత్యర్థులపై అవినీతి ఆరోపణలు చేయడం, దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం వంటి ఎత్తుగడలను ప్రయోగించింది.
ఇప్పుడు వ్యూహం మార్చి, మైండ్‌గేమ్‌తో అత్యంత వికృతమైన, ప్రమాదకరమైన అధ్యాయానికి తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. విపక్ష పార్టీ సభ్యులతోపాటు సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులను నేరుగా తాకకుండా, వారి కుటుంబ సభ్యుల ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత బలహీనతల చుట్టూ రహస్య నిఘా పెట్టి సమగ్ర సమాచారం సేకరిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. దీని ఆధారంగా అవసరమైన సమయాల్లో వారిని రాజకీయంగా లొంగదీసుకునేలా ముఖ్యనేత ఆధ్వర్యంలోని ఒక ముఠా వ్యవస్థను అత్యంత పకాగా నడుపుతున్నదని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. దీని కోసం పెద్ద నెట్వర్కే పని చేస్తున్నదని పేర్కొన్నాయి.
రహస్యంగా సేకరించిన సమాచారంతో చట్ట ప్రకారం శిక్షలు వేయించడం వీరి లక్ష్యం కాదని, ఎంతటి నేరం బయటపడినా ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదని, అధికారిక విచారణలు ముందుకు సాగవని చెప్తున్నాయి. కేసులు నమోదు చేసి జైలుకు పంపితే ప్రత్యర్థులు మరింత కసిగా ఎదురుతిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి తన చెప్పుచేతల్లో ఉంచుకోవడమే ముఖ్యనేత ప్లాన్ అని సమాచారం. అధికార పార్టీ అసమ్మతి నేతలు, విపక్ష ప్రజాప్రతినిధులు, కొందరు ఉన్నతాధికారుల పిల్లలను లక్ష్యంగా చేసుకొని, వారి లావాదేవీలు, వ్యక్తిగత వ్యసనాలు, సన్నిహిత పరిచయాలపై 24 గంటలూ పకడ్బందీగా నిఘా పెడుతున్నట్టు సమాచారం. సేకరించిన ఆడియో, వీడియో, ఆర్థిక ఆధారాలతో ‘బ్లాక్ మెయిల్ ఫైళ్లను’ సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.
సాధారణంగా ఏ ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారికైనా సమాజంలో తన హోదా ఎంత ముఖ్యమో, పిల్లల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం. నాయకులు తమపై వచ్చే రాజకీయ అవినీతి ఆరోపణలను తట్టుకోగలరు కానీ, పిల్లల ప్రతిష్ట మసకబారే నైతిక ఆరోపణలను తట్టుకోవడం అసాధ్యం. ఈ బలహీనతనే ఆసరాగా చేసుకొని, ప్రజాప్రతినిధులు గళం విప్పకుండా, సొంత పార్టీలోని అసమ్మతి నేతలు ఎదురుతిరగకుండా ముఖ్యనేత చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో మంత్రులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యనేత కనుసన్నల్లోనే కాంగ్రెస్‌లోని కీలక నేతల పిల్లల మీద గూఢచర్యం కొనసాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఆఖరికి కార్పొరేషన్ల చైర్మన్లు సైతం తీవ్రమైన అభద్రతాభావంతో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
హైప్రొఫైల్ వారసుల రోజువారీ సామాజిక జీవనం, విదేశీ పర్యటనలు, రాత్రివేళల సంస్కృతి, లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు, భూ లావాదేవీలు, వారి వ్యక్తిగత సన్నిహిత పరిచయాలపై నిరంతరం అనధికారిక నిఘా కొనసాగుతున్నదని ప్రచారం జరుగుతున్నది. పరిమితులు దాటి అడుగుజారిన క్షణాలను పిన్ పాయింట్‌గా రికార్డు చేసి, ఆ ఆధారాలతో తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు తెలిసింది.
ఈ నిఘాకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు కీలక పరిణామాలు గాంధీభవన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆదాయ వనరులకు కీలక కేంద్రంగా ఉండే ఒక మంత్రి, ఆయన కుమారుడిని లక్ష్యంగా చేసుకొని విసిరిన నిఘా వలలో ఇద్దరూ చిక్కుకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. సదరు మంత్రి గతంలో విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఒక యువతిని వెంట తీసుకెళ్లారనే వార్త ప్రభుత్వ పెద్దల అనుకూల మీడియాలోనే ప్రచారంలోకి వచ్చింది.
ఆ వేడి చల్లారకముందే, ఆయన కుమారుడు అత్తాపూర్ సమీపంలో ఒక మహిళా వైద్యురాలితో సన్నిహితంగా ఉంటున్నారనే సమాచారం, వీడియో ఆధారాలను నిఘా వర్గాలు సేకరించి పకాగా దాచిపెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యనేత ఇప్పటికే సదరు మంత్రితో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని, తాజాగా ఆయన్ను పిలిచి బెదిరించారన్న ప్రచారం జరుగుతున్నది. మరోవైపు పార్టీలో అత్యంత కీలకమైన నేతను నియంత్రించేందుకు ఆయన ప్రతి కదలికపైనా క్షేత్రస్థాయి నిఘా పెట్టించినట్టు చెప్తున్నారు.
వారంలో కనీసం ఒక్కసారైనా ఆయన ఎల్బీనగర్ కి వెళ్లడం, లక్డీకాపూల్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌కు వచ్చివెళ్తున్న దృశ్యాలను సేకరించి రికార్డు చేసినట్టు తెలిసింది. నార్సింగి పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆయన కుమారుడి భూ వివాదాన్ని కూడా అస్త్రంగా మలుచుకున్నట్టు సమాచారం. ముఖ్యనేతకు చెందిన షాడో నేత నేరుగా రంగంలోకి దిగి, సదరు నేత కుమారుడి మీద క్రిమినల్ కేసు నమోదు చేయించేందుకు ప్రణాళిక రూ పొందించినట్టు తెలిసింది. కుమారుడి భవిష్యత్తుతోపాటు తన వ్యక్తిగత రహస్యాలు బయటపడుతాయనే భయంతో సదరు నేత తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, చివరకు తన భార్యతో వెళ్లి ముఖ్యనేతను వేడుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
పబ్, డ్రగ్స్ వ్యవహారాల్లో నేతలు, బ్యూరోక్రాట్ల పిల్లలు చాలా మంది దొరికిపోయినట్టు సమాచారం. ఇటీవల నగరంలోని ఒక ప్రముఖ పబ్‌లో జరిగిన ఘర్షణలో కీలక రాజకీయ నాయకుడి కుమారుడి పేరు బయటికి వచ్చింది. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. పోలీసులు పబ్‌కు వెళ్లి సదరు ప్రముఖుని కొడుకును అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే అతడి మీద కేసు నమోదు చేయకుం డా ఆపేందుకు సదరు నాయకుడు ముఖ్యనేత వద్దకు వెళ్లి శరణుజొచ్చారనే వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది.
ఇటీవల కొన్ని ప్రముఖ కుటుంబాలకు చెందిన వ్యక్తుల పేర్లు వివిధ వివాదాల్లో విపిపించాయి. అయితే, ఆ వివరాలు తమకు ముందే తెలుసని కొందరు నాయకులు తమ సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. ముఖ్యనేతకు వ్యతిరేకంగా మారిన ఒక మహిళా మంత్రి కూతురి మీద నిఘా కొనసాగుతున్నదని చెప్పుకొంటున్నారు. విషయం తెలుసుకున్న సదరు మంత్రి కూతురు ‘నా మీదే మీరు నిఘా పెడుతారా? నేనే మీ వారసుల కదలికల మీద నిఘా పెడుతాను’ అని చెప్పి, వారి కదలికలను రికార్డు చేయడానికి రహస్య కెమెరామెన్లను పెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తంగా రాజకీయ ప్రత్యర్థులపై అవసరమైన సమాచారాన్ని నిల్వ ఉంచి ఒత్తిడి తీసుకురావడం మరింత ప్రభావంతమైన పద్ధతిగా ముఖ్యనేత అమలు చేస్తున్నట్టు చెప్తున్నారు.
తన పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్న మరో మంత్రి కుమారుడి కదలికలపై ముఖ్యనేత ఎప్పటి నుంచో కన్ను పెట్టినట్టు తెలిసింది. ఇటీవల సదరు మంత్రి కుమారుడి చుట్టూ చెలరేగిన సంచలన వివాదాలు యాదృచ్ఛికంగా బయటపడినవి కావని, అని పకా ప్లాన్ ప్రకారం నడిపిన ఆపరేషన్ అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రూ.కోట్లు విలువైన విదేశీ వాచ్‌ల దిగుమతి కేసులో డీఆర్ఐ రంగంలోకి దిగడం వెనుక, అలాగే గచ్చిబౌలిలోని విలువైన భూమి వివాదంపై రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం వెనుక ముఖ్యనేతకు చెందిన ‘సైలెంట్ ఐ’ పనిచేసిందని చెప్తున్నారు.
మంత్రి కుమారుడి విదేశీ పర్యటనలు, లగ్జరీ కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలపై మొదటి నుంచీ నిఘా పెట్టారని, సరైన సమయంలో కస్టమ్స్, డీఆర్ఐ అధికారులకు లీకులు ఇచ్చి, రికార్డుల్లో పేర్లు ఎకేలా చేశారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నది. ఇటు గచ్చిబౌలి స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నంత కాలం మౌనంగా ఉండి, పొలిటికల్ చెక్మేట్కు సమయం ఆసన్నమయ్యాకే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారని సమాచారం. అయితే, ఈ కేసుల్లో వెంటనే అరెస్టులు చేయకుండా, దర్యాప్తు కత్తిని నెత్తిమీద వేలాడదీయడమే అసలు వ్యూహమని చెప్తున్నారు. చట్టపరమైన ఆధారాలను పూర్తి స్థాయిలో హోల్డ్‌లో ఉంచి, మంత్రిని మానసికంగా, రాజకీయంగా ఆత్మరక్షణలో పడేశారనే ప్రచారం జరుగుతున్నది.