హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ తీసుకురానున్న ఆర్డినెన్స్ వల్ల ఒరిగేదేమీ ఉండదని, కేవలం బీసీ వర్గాల్లో భ్రమలు కల్పించడమేనని వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ ఒక ప్రకటనలో తేల్చిచెప్పారు. ఆర్డినెన్స్‌పై ఏ ఒక్కరు కోర్టుల్లో రిట్ దాఖలు చేసినా అమలుకు నోచుకోదని తెలిపారు. గతంలో నీలం సంజీవరెడ్డి, ఎన్టీఆర్ ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ల పెంపుపై చేసిన ఆర్డినెన్స్‌లు నిల్వలేదని, వాటిని హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు.
తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర ఎంపీలు సహా అఖిలపక్షంతో ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లులను గవర్నర్, రాష్ట్రపతి వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సూచించారు.