నిజామాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రామారెడ్డి: కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పుకుంటూ ప్రశ్నించిన ప్రజలపై కేసులు బనాయిస్తున్నది. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు దళితులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. గురువారం కామారెడ్డి జిల్లా పర్యనటలో మంత్రి సీతక్కకు పలువురు రైతులు వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఆమె ఇన్చార్జి మంత్రి కాబట్టి వడ్లకు బోనస్ చెల్లించాలని కోరారు. వారంతా సన్న రకం వరి సాగు చేశారు. గత యాసంగిలో బోనస్ రాలేదు. ఈ వానాకాలంలో బోనస్ అరకొరగా చెల్లింపు జరుగుతున్నది. ఇలాంటి ఇక్కట్లను మంత్రి సీతక్క ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
కానీ వినతిపత్రం ఇచ్చిన రైతులపై కేసులు నమోదు చేసింది. వారిలో మాజీ సర్పంచ్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు తొత్తొళ్ల గంగారం కూడా ఉన్నారు. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్య చెప్పుకుంటే కేసులు పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సాక్షిగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ ముదాం సాయిలుపై పోలీసులు దౌర్జాన్యానికి పాల్పడ్డారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అమానవీయంగా లాక్కెళ్లారు. ఇప్పుడు మళ్లీ అదే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డిలో బోనస్ అడిగినందుకు దళిత నేతపై కేసు పెట్టారు.
వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వారిలో అక్కడ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ధరించిన గులాబీ రంగు షర్ట్ చూసిన సీతక్క… మీరంతా బీఆర్ఎస్ నేతలు కదా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన రైతులపై పార్టీ ముద్ర వేయడంతో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. వీరిలో ఇద్దరు మాజీ సర్పంచ్‌లు, ఒకరు మాజీ ఎంపీపీ ఉన్నారు. రామారెడ్డిలో వాగ్వాదం తర్వాత కామారెడ్డికి చేరుకున్న మంత్రి సీతక్క.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాలతో రైతులపై రామారెడ్డి పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ సెక్షన్ 132, 126(2) కింద కేసులు నమోదు చేశారు.
మంత్రి సీతక్కకు రైతులు వినతి సమర్పించిన నేపథ్యంలో శుక్రవారం రామారెడ్డి మండలంలోని పలువురు రైతులకు బోనస్ డబ్బులు జమయ్యాయి. ఆరుగురు రైతులు ముందుండి ప్రశ్నించడం వల్లే తమకు న్యాయం జరిగిందని మండలంలో రైతులు మాట్లాడుకుంటున్నారు. కానీ.. మంత్రి సీతక్కను ప్రశ్నించిన రైతులు పడిగెల శ్రీనివాస్(ఏ1), నారెడ్డి దశరథ్‌రెడ్డి (ఏ2), తొత్తొళ్ల గంగారం (ఏ3), న్యాగల మహిపాళ్ (ఏ4), బాల్దేవ్ అంజయ్య (ఏ5), హనుమయ్యొళ్ల రాజయ్య (ఏ6)పై కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడుతున్నారు. వీరందరూ వ్యవసాయం చేసేవాళ్లేనని, ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంటే మంత్రిని ప్రశ్నిస్తే నేరమా అని నిలదీస్తున్నారు.
రైతుల సమస్యలు విన్నవించడం మినహా మాకు ఏ ఉద్దేశమూ లేదు. మంత్రిని అడ్డుకోవాలనే ఆ లోచన కూడా చేయలేదు. కానీ వందిమాగదులంటూ ఒక మంత్రి మా ట్లాడటం సభ్యసమాజం తలదించుకోవాల్సిన విషయం. యాసంగి బోనస్ రాలేదని అడిగా ను. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు రామారెడ్డి ఘటనే నిదర్శనం.
– తొత్తొళ్ల గంగారం, ఉప్పాల్వాయి గ్రామం, రామారెడ్డి
రామారెడ్డిలో మంత్రి సీతక్క కాన్వాయ్‌ను అడ్డుకున్నామనడం తప్పు. మాకు ఆ ఉద్దేశమే ఉంటే పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసేవారు. రైతుల సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మాత్రమే భావించాం. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అక్రమంగా కేసులు బనాయించారు.
– దశరథ్‌రెడ్డి, పోశానిపేట్, మాజీ ఎంపీపీ