వనపర్తి టౌన్, ఆగస్టు 31 : ఆంధ్రా పాలకుల జల చౌర్యం తెలంగాణకు దుర్దినమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాడు నీలం సంజీవయ్య ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఎగువ కృష్ణా, భీమా ప్రాజెక్టులను రద్దు చేసి నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఎన్టీఆర్, వైఎస్సార్, నేడు చంద్రబాబునాయుడు వరకు తెలంగాణ జలదోపిడీకి పాల్పడినట్టు ఆరోపించారు. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రా పాలకుల పెత్తనానికి తలవంచారని దుయ్యబట్టారు.
కృష్ణా నది వరద జలాల వినియోగం కోసమే నిర్మించిన వెలుగొండ ప్రాజెక్టుల నికర జలాలను వినియోగించడాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని, ఈ విషయంలో మౌనం వీడాలని సూచించారు. వెలుగొండ ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలను మాత్రమే వినియోగించాలన్న నిబంధన ఉన్నదని, నికర జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పాలమూరు ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నదని విమర్శించారు. గతంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం తాము పోరాడామని, తెలంగాణ జలహక్కులపై అవగాహన లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
ఆంధ్రా పాలకులకు నేటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తాబేదారుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నో ఏండ్లపాటు పోరాడి ఆంధ్రాపాలకుల నుంచి విముక్తి పొంది సాధించుకున్న తెలంగాణను మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా పాలకులకు కొమ్ము కాసేలా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరాకూ నీరు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసి రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేశారని కొనియాడారు. అలాంటి తెలంగాణను కాంగ్రెస్ పాలకులు మళ్లీ ఆంధ్రా పాలకుల పాదాల చెంత ఉంచడం దారుణమని అన్నారు.