హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధిష్ఠానం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ)కి జంబో కార్యవర్గాన్ని ఏర్పాటుచేసింది. 27మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ పీసీసీ పంపిన పేర్లను ఆమోదిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉపాధ్యక్షుల్లో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్, బసవరాజు సారయ్య తదితరులు ఉండగా, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, సీహెచ్ పర్నికారెడ్డి, డాక్టర్ మట్ట రాగమయి తదితరులకు ప్రధాన కార్యదర్శి పదవులు దక్కాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రస్తుతానికి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మాత్రమే నియమించడం గమనార్హం.