 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): అజారుద్దీన్‌కు మంత్రి ఇవ్వడంపై కాంగ్రెస్‌లో (Congress) ముసలం మొదలైంది. అసలు రేసులోనే లేని అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ ఎన్నికల (Jubilee Hills By-Election) పుణ్యమా అని కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి పదవిని కట్టబెట్టింది. దీంతో ఎప్పుటినుంచో కళ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్న నేతలకు మంత్రి పదవి ఎప్పుడిస్తారనే సణుగుడు మొదలైనట్టు తెలుస్తున్నది. అజారుద్దీన్‌తోపాటు వాళ్లకు కూడా మంత్రి పదవులిస్తే బాగుండేది కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్రెడ్డి రంగారెడ్డి, బాలూనాయక్‌లు ఎప్పటినుంచో ఆశతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావులకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చిందన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.
ఈ అసంతృప్తితోనే మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ నమ్మించి మోసం చేసిందంటూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగానే అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక సీనియర్లుగా పేరున్న సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్రెడ్డి రంగారెడ్డి, బాలూనాయక్‌లకు కూడా మొండిచేయి ఎదురవుతూనే ఉన్నది. తొలిసారి ఈ ఏడాది జూన్ 8న మంత్రివర్గ విస్తరణ జరిగింది.
ఈ విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి, సుదర్శన్‌రెడ్డి లేదా ప్రేమ్‌సాగర్‌రావుకు కచ్చితంగా చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిని మంత్రులుగా నిర్ణయించింది. దీంతో ఆశావాహులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇప్పుడు మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నా మరో ఇద్దరికి అవకాశం ఉన్నప్పటికీ కేవలం అజారుద్దీన్ ఒక్కరికే పరిమితం చేస్తుండటంపై ఆశావాహులు మరింత మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారా? మైనార్టీలపై ప్రేమతో కాదా అంటూ ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా పూర్తి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఒకసారి, ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌లో రెండోసారి మంత్రులు ప్రమాణం చేశారు. తాజాగా మూడోసారి క్యాబినెట్‌ను విస్తరిస్తున్నారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని ఎక్కువసార్లు క్యాబినెట్‌ను విస్తరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడుసార్లు కూడా పూర్తిస్థాయి క్యాబినెట్‌ను భర్తీ చేయకపోవడం గమనార్హం. క్యాబినెట్లో సీఎంతో కలిపి మొత్తం 18 మందికి అవకాశం ఉంది. తొలివిడతలో సీఎంతో పాటు 12 మంది మంత్రి మంత్రులుగా ప్రమాణం చేయగా జూన్‌లో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అజారుద్దీన్‌కు అవకాశం ఇస్తున్నారు. ఇంకా రెండు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. పూర్తిస్థాయి క్యాబినెట్‌ను ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
                            