కూసుమంచి, ఫిబ్రవరి 23 : గత ఎన్నికల్లో ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 15 నెలలు అవుతున్నా వాటి ఊసెత్తడంలేదని రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ మండిపడ్డారు. ఆదివారం ఖమ్మంజిల్లా కూసుమంచి మండల కేంద్రంలో జిల్లా ఉద్యమకాలరుల జేఏసీ ఆత్మీయ సమ్మేళనం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సుల్తాన్ మాట్లాడుతూ బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు త్యాగాలు చేశారని గుర్తుచేశారు. బత్తుల సోమయ్య మాట్లాడుతూ ఉద్యమకారుల త్యాగాలపై ఏర్పడిన తెలంగాణలో వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు.
కురవి/బయ్యారం, ఫిబ్రవరి 23: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంతోపాటు కురవి మండలం కొత్తూరు(జీ) శివారు బంచరాయితండాగ్రామంలో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. చేతికొచ్చిన మిర్చి పంటను తెంపి కల్లాల్లో ఆరబెట్టిన రైతులు ఆగమయ్యారు. మద్దతు ధరలేక రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వాతావరణ పరిస్థితులు వెక్కిరిస్తున్నాయి. వర్షం పడటంతో కల్లాల్లో మిర్చిపై వెంటనే రైతులు పరదాలు కప్పగా, కొందరి మిర్చి పంట స్వల్పంగా తడిసింది.