Telangana | ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రతో కలిపిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తరుచూ ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాలన్నింటినీ నిరంకుశంగా అణచివేసింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానిగా అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణకు శత్రువుగానే కొనసాగారు. రాజకీయ అవసరాల కోసం తెలంగాణకు అప్పటికే ఉన్న రక్షణలను కూడా రద్దుచేసి చరిత్ర క్షమించలేని ద్రోహానికి పాల్పడ్డారు. నెహ్రూ కాలం నుంచే ఢిల్లీ అధిష్ఠానికి ఊడిగం చేయటానికి అలవాటుపడిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఇందిర హయాంలో పూర్తిగా బానిసలుగా మారిపోయారు.
భారత రాజకీయాల్లో ప్రభావశాలురైన నాయకులున్నారు, నిరంకుశులైన పాలకులూ ఉన్నారు. రెండోవర్గంవారిలో ముఖ్యలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ. తెలంగాణ డిమాండ్‌కు పరిష్కారం రాజ్యాంగంలోనో, రాజకీయ చర్చలలోనో, మరో రకమైన ప్రజాస్వామ్య పద్ధతిలోనో జరగవలసి ఉన్నా.. దీనికి సరిగ్గా వ్యతిరేకంగా ఒక మనిషి విజ్ఞత, రాజకీయ లబ్ధి వం టి అంశాలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలా? వద్దా? అనే నిర్ణయాలు జరిగాయి. రెండు దశాబ్దాల పాటు తెలంగాణ డిమాండ్‌ను అన్ని పద్ధతుల్లో అణచి వేసిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ. 1960లో దేశంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాల్లో ఒకటి నక్సలైట్ ఉద్యమమైతే రెండోది జై తెలంగాణ ఉద్యమం. అప్పుడప్పుడే కాంగ్రెస్‌లోనూ, ప్రధాని ఆసనంపైనా పట్టు బిగిస్తున్న ఇందిరాగాంధీ, తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా వ్యవహరించారు.
1966లో ఆర్థిక మంత్రిగా మర్రి చెన్నారెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా తెలంగాణ పట్ల వివక్ష స్పష్టమైంది. బడ్జెట్లో చెన్నారెడ్డి ఆంధ్రాపై ఎక్కువ ఖర్చు పెట్టడం, తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వక పోవటం, పోచంపాడుకు నిధుల కోత వంటి అన్యాయాలను ఆరుట్ల కమలాదేవి బట్ట బయలు చేశారు.
ఎప్పుడూ మోసమే..!
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటి నుంచి 1967-68లో జై తెలంగాణ ఉద్యమానికి టీఎన్జీవోలు ఊపిరులూదే వరకు తెలంగాణలో ఏ దో ఒక రూపంలో తెలంగాణ ఆకాంక్ష బహిర్గతమవుతూనే వచ్చింది. 1958 మార్చి 8న తొలిసారి తెలంగాణకు ఇచ్చిన హామీలపై చర్చ మొదలైంది. జరిగిన మోసాన్ని తెలంగాణ మ హాసభ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లింది. 1961 లోనే నెహ్రూకు వినతి పత్రం ఇచ్చింది. ఇదేదీ కాంగ్రెస్ పార్టీకి పట్టలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పెదవి విప్పనూలేదు. విశాలాంధ్రకు మద్దతిచ్చిన కమ్యూనిస్టు నేతలు పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి సైతం 1961లో అసెంబ్లీలో తెలంగాణ పట్ల వివక్ష గురించి మాట్లాడారు.
కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం నోరు మెదుపలేదు. పీవీ నరసింహారావు వంటి నాయకులు సుందరయ్య వాదనను సమర్ధిస్తూ మాట్లాడినా అది వ్యక్తిగత సలహా స్థాయిలో మిగిలింది తప్ప తెలంగాణ కాంగ్రెస్‌ను కదిలించలేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా సీఎం కింద ఎలా పని చేశారో చూస్తే ఏ స్థాయి లో ఈ దాస్యం ఉండిందో అర్థమవుతుంది. 1969లో మొదలైన జై తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసమే కాదు, ఆంధ్ర కాంగ్రెస్ పా లక వర్గాలు చేస్తున్న రాజకీయం మీద, ఆ దా ష్టీకాన్ని భరిసూ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై ధిక్కారం కూడా.
ఇందిర నిరంకుశ ధోరణికి, ఇక్కడి కాంగ్రెస్ స్వార్థానికి అమరులైన తెలంగాణ వాదులకు సాక్షిగా గన్‌పార్క్ ఇప్పటికీ నిలిచే ఉన్నది. మలి ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఏదైనా నిరసనలు చేపట్టాలనుకొంటే కాంగ్రెస్‌వాదులు గన్‌పార్క్‌కు పోవటం వికృత పరిహాసమే
టీ కాంగ్రెస్ వెన్నుపోట్లు
ఖమ్మం జిల్లాలో కొలిమి రాజుకుంటున్నపుడు ‘తెలంగాణ హక్కుల రక్షణ స మితి’ ప్రదర్శన చేస్తే, అప్పటి ‘తెలంగాణ ప్రాంతీయ కమిటీ’ అధ్యక్షుడు చొక్కారావు సభా ముఖంగా చేసిన వ్యా ఖ్యలు కాంగ్రెస్ వైఖరికి అద్దం పడతాయి. ‘12 ఏండ్లుగా తెలంగాణ రక్షణలనే సాధించుకోలేని మీరు ప్రత్యేక తెలంగాణ ఎట్లా సాధిస్తారు’ అని ఉద్యమకారులను ప్రశ్నించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును సమర్థించిన కాంగ్రెస్ నాయకుడు రామానందతీర్థ 12 ఏండ్లు నిరంతరం రక్షణల ఉల్లంఘన జరిగినా నోరు విప్పలేదు. ఇక్కడ ఉద్యమం జై తెలంగాణ అని నినదించగానే ‘ప్రత్యేక తెలంగాణ వాంఛ అర్థ రహితం’ అని ప్రకటించారు.
1969 జనవరి 8న ఖమ్మంలో రవీంద్రనాథ్ సూరి నిరాహార దీక్షతో మొదలైన ఉద్యమం రాజుకోవడంతో భయపడ్డ నాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం, జనవరి 19న అఖిలపక్ష సమావేశం నిర్వహిం చి ఒక జీవో జారీ చేసింది. అందులో ‘పెద్ద మ నుషుల ఒప్పందంలోని అంశాల అమలులో ప్రభుత్వం వైపు నుంచి లోపాలు జరిగాయి’ అని ఒప్పుకుంటూనే మరోవైపు ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని బయలుదేరిన నినాదాలను, ఆందోళనలను మేము అసందిగ్ధంగా, నిరసిస్తున్నాము. ఖండిస్తున్నాము’ అని ప్రకటించారు. ఈ అఖిల పక్షంలో తెలంగాణ కాం గ్రెస్వాళ్లు ఉన్నారు.
1969 ఉద్యమంలో చివరకు వచ్చి లాభాలు అందుకు పోయింది కాంగ్రెస్. ఈ మధ్య తెలంగాణలో తెలంగాణ కోసమే వస్తున్నామని చెప్తున్న షర్మిల, కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్‌లోనే ఉంటూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజ్యాన్ని మళ్లీ తీసుకు వస్తామని అంటున్నవాళ్లను, తెలంగాణను మేమే కాపాడగలం అంటున్నవారినీ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కుక్కతోక పట్టి గోదారి ఈదినా ఈదవచ్చుగానీ… కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట మునుగుడే.. అది గుర్తుంచుకోవాలి!!
పోరాటం హైజాక్ – నాయకత్వం సరెండర్
జై తెలంగాణ పోరాటాన్ని చెన్నారెడ్డి హైజా క్ చేస్తే, పోరాట విజయాన్ని ఇందిర ఎత్తుకుపోయింది. ఉద్యమం మొదలై త్యాగాల పరంపర కొనసాగుతున్న కాలంలో గమ్మునున్న చెన్నారెడ్డి, తనకనువైన పరిస్థితిలో ఉద్యమ నాయకత్వాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి 1969 ఉద్యమంలో డౌన్ ట్రెండ్ మొదలైంది. ఉద్యమం నుంచి రాజకీయాలకు అనే పేరుతో మొదలై పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్ర జా సమితి 13 స్థానాలో 10 గెలుచుకొని సా ధించిన విజయం ప్రజా ఉద్యమానిది. ఆ తర్వాత మొదలైన అవకాశవాదం కేంద్రంలో ఇందిరాగాంధీ కనుసన్నల్లో మొదలై తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్‌లో కలిపేసుకోవడంతో ముగిసింది. ఈ ద్రోహం తర్వాతే 1969లో మొదలైన ఉద్యమం చల్లారి పోయింది.
తెలంగాణ ఉద్యమంలోంచి పుట్టింది తెలంగాణ ప్రజా సమితి. టీపీఎస్ జెండాపై గెలిచిన వాళ్లు ముందు కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లయినా వారిని ప్రజలు గెలిపించింది తెలంగాణ కోసం. ఎన్నికైన 10 మంది పార్లమెంటు సభ్యుల్లో దాదాపు 8 మందికి ఎన్నికల్లో ఆర్థిక సాయం ఇందిరా గాంధీనే చేసిందని కాకా (దివంగత వెంకటస్వామి) చెప్పడం ఇందిర రాజకీయానికీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల లొంగుబాటుకూ అద్దం పడుతుంది. అందుకే పార గుర్తుపై గెలిచిన ప్రజా సమితి నేతలు ఇందిర సైగ చేయగానే పారను కింద పడేసి, గట్టు దాటి తెలంగాణ వాదాన్ని నట్టేట ముంచారు. వీరి నాయకుడు చెన్నారెడ్డి కూడా ఉత్తరప్రదేశ్ గవర్నర్ పదవితో సంతృప్తి పడ్డాడు.
మరి 1969 నుంచి 1973 వరకు తెలంగాణ ప్రజల ఉద్యమం, ప్రాణ త్యాగాలు ఏమైనట్టు? ఈ ప్రశ్నకు ప్రతిసారి ఉదాహరణగా కాంగ్రెస్ నిలుస్తుంది. 1969 ఉద్యమంలో చివరకు వచ్చి లాభాలు అందుకు పోయింది కాంగ్రెస్. ఈ మధ్య తెలంగాణలో తెలంగాణ కోసమే వస్తున్నామని చెప్తున్న షర్మిల, కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్‌లోనే ఉంటూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజ్యాన్ని మళ్లీ తీసుకు వస్తామని అంటున్నవాళ్లను, తెలంగాణను మేమే కాపాడగలం అంటున్నవారినీ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కుక్కతోక పట్టి గోదారి ఈదినా ఈదవచ్చుగానీ… కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట మునుగుడే.. అది గుర్తుంచుకోవాలి!!
ఉద్యమం మొదలైన ప్రతిసారి వ్యతిరేకించిన కాంగ్రెస్, ఉద్యమ ఫలితాల్ని అందుకోవడానికి మాత్రం ‘నిండిన చెరువుకు చేరే కప్పల్లాగా’ పరుగెత్తింది.
తెలంగాణతో ఆడుకున్న ఇందిరాగాంధీ
నెహ్రూ తెలంగాణ విషయంలో మొద ట్లో కనీసం ‘లిప్ సర్వీస్’ చేశారు. ఇందిర మాత్రం ‘నో టు తెలంగాణ’ అనే స్టాండ్ నుంచి తగ్గలేదు. ఉద్యమాన్ని అణచడానికి ఆంధ్ర నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రయోగించారు. రాజకీయంతోపాటు దమన కాండను ప్రయోగించారు. దాదాపు 360 మందిని లాఠీలతో, బుల్లెట్లతో పొట్టన పెట్టుకున్నారు. ఇందిర నిరంకుశ ధోరణికి, ఇక్కడి కాంగ్రెస్ స్వార్థానికి అమరులైన తెలంగాణ వాదులకు సాక్షిగా గన్‌పార్క్ ఇప్పటికీ నిలిచే ఉన్నది.
మలి ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఏదైనా నిరసనలు చేపట్టాలనుకొంటే కాంగ్రెస్‌వాదులు గన్‌పార్క్‌కు పోవటం వికృ త పరిహాసమే తప్ప ఇంకొకటి కాదు. అయి నా ఉద్యమం చల్లారక పోయేసరికి ఎనిమిది సూత్రాల పథకం, ఐదు సూత్రాల పథకం, ఆరు సూత్రాల పథకం పేరుతో మాయ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 1973లో ఇందిర ప్రకటించిన ఆరు సూత్రాల పథకం అయితే మరీ దుర్మార్గం. తెలంగాణకు వర్తిస్తున్న ముల్కీ నిబంధనలు దీంతో రద్దయ్యాయి. నామ్ కే వాస్తే గా ఉన్న తెలంగాణ ప్రాంతీయ కమిటీ కూడా రద్దయి పోయింది. దీంతో పెద్ద మనుషుల ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో పూడ్చి పెట్టినట్టయ్యింది.
అనేక రాష్ర్టాలను సృష్టించినా.. తెలంగాణపై పగే
ఇందిరాగాంధీ కొత్త రాష్ర్టాల ఏర్పాటుకు వ్యతిరేకి ఏమీ కాదు. ఆమె స్వయంగా పంజాబ్‌ను చీల్చి హర్యానాను ఏర్పాటు చేసే విషయంలో నెత్తుటేరులు పారినా ఏమాత్రం లెక్క చేయలేదు. పంజాబ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రద్దుచేసి మరీ తన పంతం నెగ్గించుకున్నారు. ఎవరెన్ని హెచ్చరికలు చేసినా చలించకుండా దేశ సరిహద్దులో ఉన్న సున్నిత ఈశాన్య ప్రాంతాల్లో రాష్ర్టాలను ఏర్పాటు చేసింది కూడా ఇందిరనే. ఆమెను ఒప్పించే నాయకత్వం లేకపోవడమే తెలంగాణకు పట్టిన దౌర్భాగ్యం. తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇందిర నిట్టనిలువుగా శిలాసదృశమైన కుడ్యంలా మారిపోయారంటే దానికి ఆంధ్ర నాయకత్వం ఓ కారణమైతే, ఆమెకు నచ్చచెప్పి ఒ ప్పించే శక్తి ఉన్న నేత తెలంగాణ కాం గ్రెస్‌లో ఒక్కడన్నా లేకపోవడం మరో కారణం.
నెహ్రూ హయాంనుంచి సోనియా వరకు కూడా అధిష్ఠానాన్ని శాసించగలిగిన, మెప్పించగలిగిన నాయకులు తెలంగాణ కాంగ్రెస్‌లో కన్ను పొడుచుకున్నా కనబడరు. మహా విజ్ఞాని అనే పేరున్న జైపాల్‌రెడ్డి సైతం తెలంగాణ విషయం వచ్చేసరికి ‘నేను కేంద్రమంత్రిగా అందరికీ న్యాయం చేయాలి’ అంటూ తప్పించుకున్నారు తప్ప ముందుకు వచ్చింది లేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతగానితనానికి 70 ఏండ్లు తెలంగాణ రాష్ట్రం కడగండ్ల పాలైందన్నది చరిత్ర చెప్తున్న సత్యం. అందుకే తెలంగాణ ఏర్పాటు సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇప్పటి బీజేపీ నాయకుడు కిరణ్ కుమార్‌రెడ్డి మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పొగుడుతూ మలి దశ ఉద్యమంలో కూడా ఇందిరాగాంధీ ఆత్మను ఆవాహన చేసుకొని తెలంగాణను వ్యతిరేకించాడు.
ఎంఏ శ్రీనివాసన్
చరిత్ర పరిశోధకుడు