హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అప్పులు తీసుకోవడం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో రూ.2.43 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్ మధ్య) కేవలం రెండున్నర నెలల్లోనే ప్రకటించిన మొత్తం కంటే రెట్టింపు అప్పులు తెచ్చింది. ఈ త్రైమాసికంలో సెక్యూరిటీల ద్వారా రూ.12 వేల కోట్లు సమీకరించాలని ప్రణాళిక వేసుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ఈ నెల 30 నాటికి ఏకంగా రూ.32,500 కోట్ల అప్పులు తీసుకున్నది.
ఎఫ్ఆర్బీఎం పరిమితి ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.64,539 కోట్ల రుణాలు తెస్తామని బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్రెడ్డి సర్కారు.. అందులో రూ.54,009 కోట్లు ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా సమీకరించాలని నిర్ణయించింది. కానీ, తొలి 6 నెలల్లోనే రూ.49,900 కోట్ల అప్పు తీసుకున్నది. ఇది వార్షిక రుణ లక్ష్యంలో దాదాపు 92 శాతానికి సమానం. దీంతో మిగిలిన 6 నెలల్లో రూ.4,109 కోట్ల రుణాలు మాత్రమే సమీకరించాల్సి ఉన్నది. కానీ, దీన్ని వచ్చే నెలలోనే తీసుకుని, ఆ తర్వాత అదనపు అప్పు కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.
యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ సూల్స్ కోసం రూ.30 వేల కోట్లు సహా దాదాపు రూ.40 వేల కోట్ల నాన్-ఎఫ్ఆర్బీఎం రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. కానీ, దీనిపై మోదీ సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎఫ్ఆర్బీఎం రుణాలను పెంచాలన్న అభ్యర్థనలకు కూడా కేంద్రం స్పందించలేదు. ఈ రుణాల మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రభుత్వం బహిరంగ మారెట్ నుంచి రూ.1.66 లక్షల కోట్ల రుణాలు సమీకరించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం, స్వయం ప్రతిపత్తి సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) ద్వారా బడ్జెటేతర అప్పుల రూపంలో అదనంగా రూ.28 వేల కోట్ల రుణాలు సమీకరించింది.
రుణాల సమీకరణలో రేవంత్రెడ్డి సర్కారు దూకుడు ఇలాగే కొనసాగితే ఆర్థికంగా రాష్ట్రం మరింత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర అప్పులు, వడ్డీ చెల్లింపులు నానాటికీ పెరుగుతుండటంతో ప్రజాసంక్షేమ పథకాల అమలు, ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల చెల్లింపు, మూలధన పెట్టుబడులకు నిధులు కొరవడుతున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమై అప్పుల కోసం బిచ్చమెత్తుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి మరో రూ.4 వేల కోట్ల అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సమీకరించింది. ఇందులో 27 ఏండ్ల కాలానికి 7.53 వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్లు, 29 ఏండ్ల కాలానికి 7.52 వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్లు, 31 ఏండ్ల కాలానికి 7.44 వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్లు, 33 ఏండ్ల కాలానికి 7.44 వార్షిక వడ్డీతో మరో రూ.1,000 కోట్లు తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ.54,009 కోట్ల రుణాలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్రెడ్డి సర్కారు.. తాజా రుణంతో కలిపి తొలి 6 నెలల్లోనే (ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలోనే) రూ.49,900 కోట్ల అప్పు తీసుకున్నట్టయింది. ఇది వార్షిక రుణ సమీకరణ లక్ష్యంలో దాదాపు 92 శాతానికి సమానం. ఇందులో ఏకంగా రూ.16 వేల కోట్ల రుణాలను ఈ నెలలోనే సమీకరించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ‘రికార్డు’ నెలకొల్పింది. దీంతో మిగిలిన 6 నెలల్లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.4,109 కోట్ల రుణాలు మాత్రమే సమీకరించేందుకు వీలున్నది.
2023 డిసెంబర్ నుంచి 2025 మార్చి వరకు బహిరంగ మారెట్ నుంచి తెచ్చిన రుణాలు రూ.1.66 లక్షల కోట్లు
కేంద్ర రుణాలు, కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా తెచ్చిన బడ్జెటేతర అప్పులు రూ.28 వేల కోట్లు.