Congress | హైదరాబాద్, నవంబర్ 25, (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు చేపట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ, కాంగ్రెస్ ఏడాది పాలనలో చెప్పుకునేందుకు ఒక్క సంక్షేమ పథకమూ లేదు. పైపెచ్చు మూసీ కూల్చివేతలు, లగచర్ల గిరిజనుల భూములు గుంజుకోవడం వంటి ఘటనలతో ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠ మసకబారింది. ఈ నేపథ్యంలో ఏ ముఖం పెట్టుకుని ఏడాది సంబరాలంటూ ప్రజల్లోకి వెళ్లాలన్న అంతర్మథనం కాంగ్రెస్ నేతల్లో మొదలైంది. డిసెంబర్ 7 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కా ర్ కొలువుదీరి ఏడాది అవుతుంది. 9న సోనియాగాంధీ బర్త్డే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏడాది పాలన సంబురాలు, సోనియా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, చేసిన ఖర్చు తదితర సమగ్ర వివరాలతో ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేయాలని, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా రిపోర్టు సిద్ధం చేయాలని ముఖ్య నేత దిశానిర్దేశం చేసినట్టు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే, ఆరు గ్యారెంటీల అమలు, జాబ్ క్యాలెండర్, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మ హాలక్ష్మి, చేయూత, రూ. 4 వేల నిరుద్యోగ భృతి, ఆడబిడ్డకు రూ. లక్షతోపా టు తులం బంగా రం.. వంటి ఏ ఒక్క పథకమూ అమలు కాకపోవడంతో ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలంటూ కాంగ్రె స్ నేతలు భయపడుతున్నారు. ఉత్సవాలను తొలుత రెండు వారాలు నిర్వహించాలనుకున్నా, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీల ఫిర్యాదు ల నేపథ్యంలో వారానికి కుదించినట్టు తెలిసింది. కానీ, కార్యక్రమాల పై ఇప్పటి వరకు ఎలాంటి ఎజెండా లేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
మహాలక్ష్మి పథకం కిం ద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా కాం గ్రెస్ ఏదీ అమలు చేయలేకపోయింది. ప్ర తి మహిళకు నెలకు రూ. 2,500 అనే కీలక హామీపై ఎలాంటి ప్రకటనా లేదు. దీనిపై గ్రామల్లో మహిళలు నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఇస్తామన్న హామీ కూడా మూలన పడింది. రైతు భరోసా లేకపోవడం తో రైతులు ఆందోళనతో ఉన్నారు. ఇందిరమ్మ పథకం కింద ఇంటి జాగ, రూ.5 లక్షల హామీ తో నియోజకవర్గానికి 3,500 చొ ప్పున రూ. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కా ర్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూ లు, పింఛను రూ.4000కు పెంపు వంటి హామీలు కూడా అటకెక్కాయి.
రుణ మాఫీ రివర్స్ కావడంపై కాంగ్రెస్ నేత లు ఆందోళనతో ఉన్నారు. ఇంకా 22 లక్షల మంది రైతులకు మాఫీ కావాల్సి ఉండగా వా రికి ఎప్పటిలోగా చేస్తారన్న దానిపై స్పష్టత లే దు. ఇది పూర్తిగా అమలైతే ప్రజల్లోకి వెళ్లేవారమని, కానీ ఇప్పుడు రైతులకు ముఖం చూపిం చే పరిస్థితి లేదని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ కూడా ఎటూ కాకుండా పోయింది. బీఆర్ఎస్ హయాంలో వేసిన నోటిఫికేషన్లకు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చి తామే ఇచ్చుకుంటున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా నమ్మేందుకు ఎవరూ సిద్ధం గా లేరు. ఇలా అన్నింటా విఫలమైన తర్వాత ప్రజలను ఇంకా మభ్యపెట్టడం అసాధ్యమని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.
తమ నేత 11 నెలల కాలంలోనే ఏకంగా రూ 87 వేల కోట్ల అప్పు చేశాడని, డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సరిగ్గా 5 రోజులకు అంటే డిసెంబర్ 12న రూ. 1000 కోట్ల అప్పు తెచ్చారని, ఇందులోంచి రూపాయి కూడా సంక్షేమ పథకానికి వినియోగించలేదని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖజానాలో నిల్వ ఉన్న డబ్బును, అప్పుగా తెచ్చిన డబ్బును మొత్తం కలిపి, ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వంలోని ఓ కీలక నేతకు కాం ట్రాక్టు బిల్లు బకాయిల కింద చెల్లించినట్టు గాం ధీ భవన్ వర్గాలే చెప్పుకుంటున్నాయి. అప్పటి నుంచి ప్రతి నెలా బాండ్లు తాకట్టు పెట్టో, కా ర్పొరేషన్లను తనఖా పెట్టో వేల కోట్లు అప్పులు చేస్తున్నారని, కనీసం ఈ డబ్బునైనా సంక్షేమ పథకాలకు వినియోగించి ఉంటే, రైతులు, మహిళలు బాగుపడేవారని అంటున్నారు.
పరిపాలనా కేంద్ర బిందువైన సీఎంవో ఇప్పటి వరకు పాలన మీద పట్టు సాధించలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మీద పూర్తి పట్టున్న ఒక్క బ్యూరోక్రాట్ కూడా సీఎంవోలో లేకపోవడం ప్రధాన లోపమన్న విమర్శలున్నాయి. నేరుగా ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే మినహా శాఖాధితులైన ఐఏఎస్లు, ఐపీఎస్లు వినే పరిస్థితి లేదని దక్షిణ తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 28 సార్లు హైదరాబాద్-ఢిల్లీ మధ్య చక్కర్లు కొట్టడానికే ముఖ్య నేతకు సరిపోయిందని, దీంతో పాలనపై పట్టు సాధించలేకపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలో అర్థం కావడం లేదని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు.