హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యకాండకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణాల్లోనూ తప్పదని గ్రహించే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనుసన్నల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అధికారపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా వెన్నుచూపకుండా మొక్కవోని దీక్షతో వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులకు పేరుపేరునా ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.
రెండేండ్లలో ఘోరమైన పాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పురపాలక ఎన్నికల్లో అక్రమాలపర్వానికి తెరలేపారని ఆరోపించారు. అక్రమంగా లూటీ చేసిన ప్రజాధనంతో ప్రజాతీర్పును మార్చే కుట్రలకు తెగబడ్డారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ శ్రేణులు, అభ్యర్థులపై దాడులకు ఉసిగొల్పారని మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్ అరాచకాలు, దుర్మార్గాలు, దాడులను విజయవంతంగా తిప్పికొట్టి అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు వీరోచిత పోరాటం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
వారి మొక్కవోని దీక్ష, కంకణబద్ధమైన కృషి పార్టీకి కొండంత బలం, ఆత్మవిశ్వాసం నింపిందని కొనియాడారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ శ్రేణులపై వేధింపులు, దాడులకు దిగిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ప్రజలకిచ్చిన హామీలు, పాలనను పూర్తిగా గాలికొదిలి, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం ముఖ్యమంత్రిని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజాసమస్యలపై బీఆర్ఎస్ పోరాటం ఆపబోమని స్పష్టంచేశారు.